భక్తుల సహకారంతో ఉత్సవాలు ప్రశాంతం
మహంకాళి ఆలయంలో ఘటం ఊరేగింపును ప్రారంభించిన సీపీ సజ్జనార్
ఖైరతాబాద్, ఆగస్టు10 (విజయక్రాంతి): నగరవ్యాప్తంగా నిర్వహించిన ఆషాడ బోనాల ఉత్సవాలు భక్తుల సహకారంతో ప్రశాంతంగా, వైభవంగా ముగిశాయని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు.పాతబస్తీలోని చారిత్రాత్మక అక్కన్నమాదన్న మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘటం ఊరేగింపును నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం ప్రారంభించారు. అంతకుముందు ఆలయాన్ని సందర్శించిన ఆయన మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ,విశిష్ట చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఘటం ఊరేగింపును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.గతంలో ప్లేగు వంటి మహమ్మారులు,వరదల వంటి విపత్తుల నుంచి నగర ప్రజలను మహంకాళి అమ్మవారి కరుణ రక్షించిందని, ఆ దయ భవిష్యత్తులోనూ నగరంపై నిలిచి ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఊరేగింపు మార్గమంతా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు.ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హరిబౌలిలోని అక్కన్నమాదన్న ఆలయం నుంచి ప్రారంభమైన ఘటం ఊరేగింపు గౌలిపురా,లాల్ దర్వాజ,శాలిబండ మీదుగా సాగి నయాపూల్ వద్ద ముగియనుంది.
ఉత్సవాలను విజయవంతం చేసిన ఆలయ ధర్మకర్తలు,నిర్వాహకులు,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,భక్తులకు నగర పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించిన పోలీసు అధికారులు, సిబ్బందిని భినందించారు. ఈకార్యక్రమంలో అదనపు సీపీలు ఎం.శ్రీనివాస్,తఫ్సీర్ ఇక్బాల్,డీసీపీలు వైభవ్ గైక్వాడ్,ఖారే కిరణ్ ప్రభాకర్,ఆర్. వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్,జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ,సలహాదారు రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.






