calender_icon.png 30 September, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా: సజ్జనార్

30-09-2025 01:56:15 PM

  1. హైదరాబాద్ పోలీసులు అనేక విజయాలు సాధించారు.
  2. ప్రతి పౌరుడూ పోలీసుగా పనిచేయాలి.
  3. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తా.
  4. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం.
  5. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాహనదారులు జాగ్రత్త.

హైదరాబాద్: నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వీసీ సజ్జనార్(VC.Sajjanar) పేర్కొన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  హైదరాబాద్ లో అనేమంది గొప్పవాళ్లు సీపీలుగా పనిచేశారని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ పోలీసులు అనేక విజయాలు సాధించారని కొనియాడారు. బాధ్యత కలిగిన ప్రతి పౌరుడూ పోలీసుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సైబరాబాద్ లో పనిచేసినప్పుడు ప్రజలు ఎంతో సహకరించారని చెప్పిన సజ్జనార్ పీపుల్స్ ఫ్రెండ్లీ అని హైదరాబాద్ పోలీసులకు మంచి పేరుందన్నారు.  దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం... హైదరాబాద్ అన్నారు.

ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. డ్రగ్స్(Drugs) అన్న ఆయన డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రగ్స్ పై ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ముందుకెళ్తామన్నారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరస్థులు.. వృద్దులను టార్గెట్ చేసి మోసం చేస్తున్నారని, అవగాహన, అప్రమత్తత లేక అనేకమంది నష్టపోతున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై నగర ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. స్టాక్ మార్కెట్(Stock market)లో పెట్టుబడుల పేరుతో వచ్చే కాల్స్ పై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

హైదరాబాద్ లో నేరాల కట్టడికి అనేక చర్యలు చేపడతామన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ వల్ల యువత బాగా చెడిపోతున్నారని ఆయన సూచించారు. ఆన్ లైన్ బెట్టింగ్.. యాప్స్ కు ప్రమోషన్ చేయవద్దని వీఐపీలను సజ్జనార్ కోరారు. డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ ను నమ్మవద్దన్నారు. అరుదైన వ్యాధులకు ఔషధాల పేరుతో మోసాలు పెరుగుతున్నాయని వివరించారు. ఆన్ లైన్ మోసాలు(Online scams) చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. జీఎస్టీ తగ్గించాక వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగిందన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. ట్రాఫిక్ వల్ల సమయం వృథా మాత్రమే కాదు.. ఆరోగ్యం పాడవుతుందని వెల్లడించారు. మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవన్న సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) చేసే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.