calender_icon.png 30 September, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

30-09-2025 02:13:49 PM

వనపర్తి,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూముల ఏర్పాటు, ఓట్ల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ కోసం కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు, బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్ల కోసమై జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ భవనాలను తనిఖీ చేశారు. 

జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత మార్కెట్ సముదాయాన్ని, జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల, జెడ్పి బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సహా రాజపేట సమీపంలోని ఐటిఐ, వై టీ సీ భవనాలను సందర్శించి పరిశీలించారు. ఆయా ప్రభుత్వ భవనాల్లో స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటు, కౌంటింగ్ హాల్ ఏర్పాటు కోసం కావాల్సిన సదుపాయాల గురించి ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, ఓట్ల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

మండలాల వారీగా స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్స్ కోసం అనువైన భవనాలను ఎంపిక  చేసుకున్న అనంతరం వాటిలో సీసీ కెమెరా ద్వారా స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ పర్యవేక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేయించాలన్నారు. అదేవిధంగా వాటిల్లో కౌంటింగ్ కు కావలసిన అన్ని రకాల సదుపాయాలతో పాటు బారిక్యాడ్స్, పోలీసు భద్రత కోసం ఏర్పాటు చేయించాలన్నారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వనపర్తి మండల తహసిల్దార్ రమేష్ రెడ్డి, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ భాను ప్రసాద్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.