30-09-2025 02:56:18 PM
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో జరిగిన పేలుడు ప్రమాదంలో 10 మంది మరణించగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం క్వెట్టాలోని జార్ఘున్ రోడ్‌లోని ఎఫ్సీ(Frontier Constabulary) ప్రధాన కార్యాలయం ముందు బాంబు పేలింది.
ఈ పేలుడు శబ్దాలు మోడల్ టౌన్, పరిసర ప్రాంతాలలో వినిపించడంతో స్థానికులు భయాందోళనలతో పరుగుపెట్టారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలో ఇళ్ళు, భవనాల కిటికీలు పగిలిపోయాయి. రద్దీగా ఉండే రోడ్డుపై శక్తివంతమైన పేలుడు సంభవించిన సీసీటీవీ పుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
క్వెట్టాలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) స్పెషల్ ఆపరేషన్స్ ముహమ్మద్ బలోచ్‌ను మాట్లాడుతూ.. పేలుడు పదార్థాలు నిండిన వాహనం మోడల్ టౌన్ నుండి ఎఫ్సీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని హాలి రోడ్ వైపు మలుపు తీసుకోవడంతో పేలుడు సంభవించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిలో 10 మంది మరణించారని బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ తెలిపారు. వీరిలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారని ఆయన తెలిపారు. ఈ పేలుడు దాడిలో ముప్పై రెండు మంది గాయపడిన వారిని సివిల్ హాస్పిటల్, ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు.