బోధన్ పట్టణంలో బక్రీద్ పండుగ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన -సీపీ
బోధన్ మే 28 (విజయక్రాంతి): బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్లలో పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
ఈ సందర్భంగా నేడు బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సి రోడ్డు ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈద్గా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు , సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) శుభం ప్రకాష్, బోధన్ ఏసిపి శ్రీనివాస్, సి.టి.సి ఎ.సి.పి రాజశేఖర్, టౌన్ ఎస్.హెచ్.ఓ వెంకట్ నారాయణ, సీఐలు, ఎస్త్స్రలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






