భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
భోలక్ పూర్ బడీ మసీద్ వద్ద పోలీసుల బందోబస్తు
ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి): త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముషీరాబాద్ నియోజకవర్గం లోని ముషీరాబాద్, భోలక్ పూర్, రాంనగర్, అడిక్మెట్, కవాడిగూడ, గాంధీ నగర్ డివిజన్ లలో గురువారం ముషీరాబాద్ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నియోజకవర్గంలోని భోలక్ పూర్ లోని 400 చరిత్రగల బడీమసీద్, బిలాల్ మసీద్, ఏక్ మినార్ మసీదులలో ఉదయం 8 గంటలకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా బడీ మసీద్ వద్ద చిక్కడపల్లి ఏసీపీ రణవీర్ రెడ్డి, ముషీరాబాద్ సీఐ రాజ్ పాల్ రెడ్డిలు పోలీస్ బందోబస్తును పరిశీలించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ మోహినోద్దీన్ తదితరులు ఏసీపీ రణవీర్ రెడ్డిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోలక్ పూర్ కు చెందిన అక్షక్ హుస్సేన్ ముస్లీంలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
త్యాగానికి ప్రతీక: కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్
సికింద్రాబాద్,మే28 (విజయక్రాంతి): బక్రీద్ పండుగ భక్తి, త్యాగం,కరుణ,విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తున్నదని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ బోర్డ్ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ త్యాగం,సహనం బక్రీద్ పండుగ ఇచ్చేసందేశాలన్నారు
.దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ సమిష్టి ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్ధాన్ని,వీడి త్యాగాలకు సిద్దపడినప్పుడే సమాజ హితం సాధ్యామవుతుందని, త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్ధకత అనే సందేశాన్ని బక్రీద్ పండుగ విశ్వ మానవాళికి అందిస్తుందని అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతాప్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లీంలను ఆలింగానం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చోటు, మౌలా, సులేమాన్, బండి శ్రీనివాస్,సాయిబాబా యాదవ్, కరణ్ సింగ్, యాదగిరి,దాఫెధార్ గణేష్,వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్‌పల్లి, మే 28 (విజయక్రాంతి): బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం కెపిహెచ్బి కాలనీలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగం, విశ్వాసం, అల్లాహ్ ఆజ్ఞలపట్ల సంపూర్ణ విధేయతకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
హజ్రాత్ ఇబ్రహీం చూపిన త్యాగభావం మానవాళికందరికీ ఆదర్శం అని, సమాజ శ్రేయస్సు, సోదర భావం, మానవతా విలువలు వెల్లివిరిసే బక్రీద్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, బిఆర్‌ఎస్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌస్ ఉద్దీన్, బి ఆర్ ఎస్ కేపీహెచ్బీ డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన దిడ్డి రాంబాబు
ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి): బర్కతపురలోని వాజిర్ అలీ మాజిద్ లోని ముస్లిం మత పెద్దలైన మాజిద్ ఇమామ్, నసీబ్ సాహెబ్ తదితరులను జిహెచ్‌ఎంసి మాజీ ఫ్లోర్ లీడర్ దిద్ది రాంబాబు కలసి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను కలిసి ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.






