5 June, 2026 | 10:11 PM

కానామెట్‌లో ప్రభుత్వ భూముల కబ్జాపై సిపిఐ ఆగ్రహం

05-06-2026 09:39 PM

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): శేరిలింగంపల్లి మండలం కానామెట్ గ్రామంలో అసైన్డ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములపై భారీ అక్రమ కబ్జాలు జరుగుతున్నాయని సిపిఐ నాయకులు ఆరోపించారు.సర్వే నంబర్లు 41/2, 41/5, 41/7, 41/3, 41/11/ఏ, 60, 46, 64, 58, 50, 59, 43, 45 తదితరాల్లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అమర్నాథ్ రెడ్డి అనుచరులతో కలిసి కబ్జా చేస్తున్నారని, దీనికి కొందరు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు.

1961 చట్టం ప్రకారం ఎస్సీ, బీసీ, మైనారిటీ పేదలకు కేటాయించిన భూములు మాఫియా చేతుల్లోకి వెళ్తున్నాయని, పేదలపై మాత్రం చర్యలు తీసుకుంటున్నారని వారు విమర్శించారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసి, ఆదాయపు పన్ను శాఖ, ఈడీతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, భూములను స్వాధీనం చేసుకోవాలని సిపిఐ కోరింది. చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.