పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని సీపీఐ ధర్నా
వరంగల్, మార్చి 16 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతోనే దేశంలో చమురు సంక్షోభం నెలకొందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని, చమురు సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖాళీ గ్యాస్ సిలిండర్ లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నేడు నెలకొన్న ఈ సంక్షోభం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దూరదృష్టి లేని విధానాలు, తప్పుడు ప్రాధాన్యతల ప్రత్యక్ష ఫలితం అన్నారు. వినియోగదారులను రక్షించడానికి బదులుగా, ఆ భారాన్ని పూర్తిగా ప్రజలపై పడేలా చేసిందని, ఈ వైఫల్యాల పరిణామాలను ఎదుర్కోలేక, ప్రధానమంత్రి ప్రజలకు ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.
గృహ సిలిండర్లపై రూ. 60, వాణిజ్య సిలిండర్లపై రూ. 115 పెరుగుదలతో పాటు అనేక ప్రాంతాలలో లభ్యత లేకపోవడంతో, వంట గ్యాస్ పొందడానికి ప్రజలు మండే ఎండలో పొడవైన క్యూలలో నిలబడవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్పీజీ శ్రామిక కుటుంబాలకు ఒక ప్రాథమిక అవసరం అయినప్పటికీ మోడీ ప్రభుత్వ వైఫల్యంతో దానిని రోజువారీ పోరాటంగా మార్చిందన్నారు.
వాణిజ్య సిలిండర్లపై ఆధారపడిన చిన్న తినుబండారాలు, టీ స్టాళ్లు, ధాబాలు, రెస్టారెంట్లపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. భారత దేశం చమురు కొనుగోలు చేయడానికి అమెరికా సహా ఏ దేశం అనుమతి అవసరం లేదని, ఈ విషయంలో భారత దేశం సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు మోతె లింగారెడ్డి, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, ఎన్ ఎ స్టాలిన్, ఎదునూరి వెంకట్రాజం, మునిగాల భిక్షపతి, బత్తిని సదానందం, తదితరులు పాల్గొన్నారు.




