26 August, 2026 | 3:24 AM

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

26-08-2026 02:12 AM

అక్రమ నిల్వ, మళ్లింపుపై ప్రత్యేక నిఘా...

ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు

సివిల్ సప్లైస్, పోలీస్ అధికారుల సమన్వయ సమావేశంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు

పెద్దపల్లి, ఆగస్టు 25 (విజయక్రాంతి): ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం, ఇతర ప్రాంతాలకు మళ్లించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీస్, సివిల్ సప్లైస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ నిల్వ, మళ్లింపును అరికట్టే చర్యలపై పోలీస్, సివిల్ సప్లైస్ అధికారులతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం అందిస్తున్న బియ్యం అక్రమ మార్గాల్లో తరలిపోవడం వల్ల పేదలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించే వ్యక్తులు, నిల్వదారులు, రవాణాదారులతో పాటు వారి వెనుక ఉన్న మొత్తం నెట్వర్క్పై ప్రత్యేక నిఘా పెట్టాలని సీపీ ఆదేశించారు. అక్రమ రవాణాకు సహకరించే వ్యక్తులు, వాహనదారులు, నిర్వాహకులను గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అవకాశం ఉన్న మార్గాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిరంతరం నిఘా కొనసాగించాలని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు, దాని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పోలీస్, సివిల్ సప్లైస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీపీ ఆదేశించారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్రావు, సివిల్ సప్లైస్ డీసీఎస్వో కె. శ్రీనాథ్, డీటీ సంతోష్సింగ్, ఇతర పోలీస్, సివిల్ సప్లైస్ అధికారులు పాల్గొన్నారు.