15 August, 2026 | 3:01 AM

వరుస చైన్ స్నాచింగ్ కేసుల ఛేదన

15-08-2026 01:34 AM

8 మంది అరెస్ట్ 

రూ.26 లక్షల సొత్తు స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 14, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు సమర్థవంతంగా ఛేదించారు. శుక్రవారం వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు  ఆదేశాల మేరకు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట, దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన వరుస చోరీ కేసులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.

ఈ కేసులకు సంబంధించి మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి సుమారు 150 గ్రాముల బరువున్న 6 బంగారు గొలుసులను, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ సుమారు రూ.26 లక్షలు ఉంటుందని తెలిపారు. ప్రధాన నిందితుడు సున్నం నాగేంద్రబాబు @ నాగేంద్ర తన సహచరులతో కలిసి రాత్రి వేళల్లో ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడని దర్యాప్తులో వెల్లడైంది.

మహిళల మెడలోని బంగారు గొలుసులను ఎలక్ట్రిక్ వైర్ కట్టర్తో కట్ చేసి క్షణాల్లో అపహరించి, ద్విచక్ర వాహనాలపై అక్కడి నుంచి పరారయ్యేవారు. కొన్ని సందర్భాల్లో ముందుగానే ద్విచక్ర వాహనాలను చోరీ చేసి, వాటిని తదుపరి నేరాలకు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

చోరీ చేసిన బంగారు ఆభరణాలను నిందితులు తమ వద్ద ఉంచుకోకుండా, ముఠాకు సహకరిస్తున్న మహిళల వద్ద దాచిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల విచారణలో దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 10 కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయి. ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన సున్నం నాగేంద్రబాబు, వయస్సు 35 సంవత్సరాలు, ఉసిర్లగూడెం గ్రామం, అశ్వారావుపేట మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ఇతనిపై అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, బూర్గంపాడు, పాల్వంచ, భద్రాచలం, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 83 దొంగతనం కేసులు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇతనితో పాటు వల్లూరి శాంతరాజు @ రాజు, ఉకే భద్రం @ వీరభద్రం, బెత్తి కార్తిక్, ఊర లింగయ్య, బెత్తి ఆదిలక్ష్మి, కల్లూరి లావణ్య, అల్లం సారమ్మ @ సర్లమ్మలను పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరిలో వల్లూరి శాంత రాజుపై 11 దొంగతనం కేసులు, ఊర లింగయ్యపై 12 దొంగతనం కేసులు ఉన్నట్లు  తెలిపారు. ఈ కేసుల్లో మరో నిందితుడైన తమ్మిశెట్టి బాలవీరస్వామి, వయస్సు 50 సంవత్సరాలు, మాధాల గ్రామం, ముప్పాళ్ల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతను అంతర్రాష్ట్ర నేరస్తుడిగా గుర్తించామని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పి తెలిపారు.

దర్యాప్తులో భాగంగా పార్కలగండి, దమ్మపేట పరిధిలో వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారు నానుతాడు చోరీ చేసినట్లు, బూర్గంపాడు పరిధిలో ద్విచక్ర వాహనం చోరీ చేసినట్లు, పాల్వంచ రూరల్ పరిధిలో మరో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం చోరీ చేసిన వాహనాలను ఉపయోగించి బూర్గంపాడు, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాయిగూడెం కేసులో ప్రధాన నిందితుడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇతర కేసుల్లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను నిందితుల సహకారంతో వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వరుస చైన్ స్నాచింగ్ కేసులను సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని  ఎస్పీ అభినందించారు.

నేరాల నియంత్రణలో భాగంగా జిల్లాలో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎస్పీ తెలిపారు. ఈ కేసుల ఛేదనలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, అశ్వారావుపేట సీఐ నాగరాజు, ఎస్‌ఐలు రాజేశ్ కుమార్, యయాతి రాజు, బాలస్వామినాధం, దేవ్ సింగ్, హెచ్సీ ప్రసాద్, పీసీలు వెంకట్,ధర్మారావు, లక్ష్మయ్య, రామకృష్ణారెడ్డి, బాలకృష్ణ, నరసింహారావు, డబ్ల్యూపీసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.