07-01-2026 12:00:00 AM
ఎస్పీ శబరీష్
మహబూబాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): బ్యాంకర్ల సహకారంతో ఆర్థిక నేరాలను నియంత్రించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుందని మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఎటిఎం భద్రత, బ్యాంకు మేనేజర్లు బ్యాంకు సిబ్బందితో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, క్యూఆర్ కోడ్ మోసాలు, ఆన్లైన్ లోన్, ఇన్స్టంట్ లోన్స్ పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులు నిఘా (సర్వైలెన్స్), సున్నితమైన లావాదేవీల పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండాలని తెలిపారు.
ఈ సమావేశంలో సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ ప్రొఫైల్స్ తయారీ, పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా, బ్యాంకులు, పోలీస్ శాఖ మధ్య సమన్వయంతో సమాచారం పంచుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన వెంటనే సంబంధిత ఖాతాలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని బ్యాంకు అధికారులకు సూచించారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్లైన్ నెంబర్ లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు గండ్రతి మోహన్, టౌన్ డిఎస్పీ తిరుపతిరావు, ఎస్.బి ఇన్స్పెక్టర్ నరేందర్, రూరల్ సీఐ సరవయ్య, బయ్యారం సీఐ రవికుమార్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.