920 ఎకరాల్లో పంట నష్టం
l అకాల వర్షాలతో చేజారిన పంటలు
l నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్న అధికారులు
l నివేదిక రాగానే పరిహారం అందిస్తామన్న మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా నష్టపోయిన పంట, రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. శనివారం కురిసిన అకాల వర్షాలకు రంగారెడ్డి, జనగాం, నిర్మల్ జిల్లాల్లో 920 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మార్చిలో కురిసిన వడగండ్లకు 2,200 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందుకు సంబంధించిన పరిహారం విడుదల చేసేందుకు ఈసీ ఆమోదం కోసం ప్రభుత్వం పంపిన సంగతి తెలిసిందే.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా ఈసీని మరోసారి సంప్రదించి నిధులు విడుదలకు అనుమతులు పొందేలా విజ్ఞప్తి చేయమని, వాటితో పాటే ప్రస్తుత నష్టాన్ని కూడా తొందరగా మదింపు చేసి నివేదిక సమర్పించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంట నష్టానికి సంబంధించిన నివేదికలు అందిన వెంటనే నిధులు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. పచ్చి రొట్టె విత్తనాల సేకరణ కోసం టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.






