5 July, 2026 | 11:28 AM

విద్యకు రూ.23,108 కోట్లు

20-03-2025 01:32 AM
  1. మొత్తం పద్దులో ఈ కేటాయింపులు 7.57 శాతం
  2. సింహభాగం జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులకే సరి
  3. నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనకు ఇక మొండిచేయే..
  4. కేటాయింపులు సరిపోవంటున్న ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు
  5. ఎన్నికల హామీ.. 15 శాతం కేటాయింపులు ఏవంటూ నిలదీత

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): తెలంగాణ బడ్జెట్ (2025-26) రూ.3,04,965 కోట్లు కాగా, సర్కార్ విద్యారంగానికి రూ.23,108 కోట్లు కేటాయిం చింది. ఈ కేటాయింపులు బడ్జెట్ మొత్తంలో 7.57 శాతం. 2024-25 బడ్జెట్ 2,91,159 కోట్లు కాగా, విద్యకు కేటాయింపులు రూ. 21,292 (7.31 శాతం) కోట్లు.

ఈ చొప్పున గతేడాదితో పోల్చుకుంటే ఈసారి 0.26 (రూ.1816 కోట్లు) శాతం విద్యకు అధికంగా నిధులు కేటాయించినప్పటికీ, అవేం పెద్ద కేటాయింపులు కాదని, వాటితో విద్యారంగంలో గణనీయమైన మార్పులేవీ సంభవిం చవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘విద్య భవిష్యత్తుకు బీమా’ అని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క పేర్కొన్నప్పటికీ, కేటాయింపులు మాత్రం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.

ఒకవైపు విద్యారంగానికి ప్రాధాన్యం ఇ స్తున్నట్లు చెప్తూనే బడ్జెట్‌లో అతితక్కువ నిధులు కేటాయించడంపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్ ప్రసంగంలో ప్రిప్రైమరీ విద్య ప్రస్తావనే లేదు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్నట్లుగా ప్ర భుత్వం చెప్తున్నదని, కానీ అవి పాఠశాలలకు అనుసంధానంగా ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. అలా జరిగినప్పు డే తల్లిదండ్రులు కూడా పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఇష్టపడతా రని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడకపోవడాన్ని తప్పుబడుతున్నారు.

15 శాతం కేటాయింపులు ఉత్తదే..

అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి పద్దు ఓటాన్ అకౌంట్ కాగా, దానిలో విద్యకు కేటాయింపులు 7.75 శా తం. తర్వాత ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో మొత్తం బడ్జెట్‌లోనూ సర్కార్ విద్యకు కేవ లం 7.31శాతం నిధులు మాత్రమే కేటాయించిం ది.

2025- 26 వార్షిక బడ్జెట్‌లోనైనా విద్యకు ఎక్కువ కేటాయింపులు ఉంటాయని తెలంగాణ సమాజం ఆశించగా, ఈసారి కూడా కేటాయింపులు కేవలం 7.57 శాతానికి పరిమితమయ్యాయి. బడ్జెట్ నిధుల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌కు రూ.16,298 కోట్లు, ఉన్నత విద్యకు రూ.3,009 కోట్లు ఎస్లాబ్లిష్‌మెంట్‌కే వెళ్లనున్నాయి.

ఇక పథకాలకు సంబంధించి ఉన్నత విద్యకు రూ.635 కోట్లు కాగా, సెకండరీ విద్యకు రూ.3,166 కోట్లు  వెళ్తాయి. ఇక మిగిలిన నిధులతో మౌలిక వసతుల కల్పన కష్టతరమే. విద్యార్థులకు నాణ్యమైన మధ్యా హ్న భోజనం అందించడమూ మృగ్యమే. కేజీబీవీ అప్‌గ్రెడేషన్ కూడా అలవిగాని చర్య. 

వేతనాలకే రూ.19 వేల కోట్లు

బడ్జెట్‌లో విద్య రంగానికి కేటాయింపులు అంకెల పరంగా భారీగానే కనిపిస్తున్నప్పటికీ, కేటాయింపుల్లో 80-90 శాతం నిధులు నిర్వహణ, జీతభత్యాలకే వెళ్తాయి. ఉన్నత విద్యకు మొత్తం రూ.3,643 నిధులు కేటాయించగా, వీటిలో జీతభత్యాలు, నిర్వహణకే రూ.3,009 కోట్లు వెళ్తాయి. పాఠశాల విద్య కు రూ.19,464 కేటాయించగా, దానిలో సింహభాగం జీతభత్యాలు, నిర్వహణకే రూ.16,298 కోట్లు వెళ్తాయి.

ఈచొప్పున మొత్తం కేటాయింపుల్లో రూ.19,307 కోట్లు జీతభత్యాలు, నిర్వహణకే అన్నమాట. గత వార్షిక బడ్జెట్‌లో విద్యకు రూ.21,292 కోట్లు కేటాయించగా, దీనిలో ఉన్నత విద్యకు రూ. 3,350 కోట్లు, సెకండరీ విద్య (పాఠశాల విద్య)కు రూ.17,942 కోట్ల కేటాయింపులు జరిగాయి.

2023-24 బడ్జెట్‌లో సెకండరీ విద్యకు రూ.16,092 కోట్ల కేటాయింపులు జరిగాయి. అలాగే ఉన్నత విద్యకు రూ. 3,001 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తం గా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం సర్కార్ బడ్జె ట్‌లో రూ.2,900 కోట్లు కేటాయించింది.

వర్సిటీలకు రూ.500 కోట్లు..

వర్సిటీ అభివృద్ధి కోసం సర్కార్ ఈ సారి ప్రత్యేక డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.500 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఇలా కాకతీయ వర్సిటీకి రూ.50 కోట్లు, అంబేద్కర్ వర్సిటీకి రూ.25 కోట్లు, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీకి రూ.35 కోట్లు, తెలంగాణ వర్సిటీకి రూ.35 కోట్లు, మహాత్మాగాంధీ వర్సిటీకి రూ.35 కోట్లు, శాతవాహన వర్సిటీకి రూ.35 కోట్లు, పాలమూరు వర్సిటీకి రూ.35 కోట్లు, ఉస్మానియా వర్సిటీకి రూ.100 కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి రూ.100 కోట్ల కేటాయింపులు జరిగాయి.

ఇవి కాకుండా వర్సిటీ సిబ్బంది వేతనాలకు అదనంగా మరికొన్ని నిధుల కేటాయింపు జరిగింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో వర్సిటీల్లో నియామక ప్రక్రియ అన్న మాటే లేదు. దీంతో 12 వర్సిటీల్లో ఖాళీలు ఖాళీలుగానే మిగిలిపోనున్నాయి. ఒక్క చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీని పక్కనబెడితే మిగిలిన, 11  వర్సిటీల్లోనూ 73 శాతం వరకు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలైతే దాదాపు రూ.5 వేల కోట్ల వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. సర్కార్ వాటిని ఎలా చెల్లిస్తుందనే విషయం బడ్జెట్ ప్రసంగంలో లేదు.

ఈ హామీల ఊసేలేదు..

కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. డిక్లరేషన్‌లో భాగంగా నిరుద్యోగ భృతి, విద్యార్థుల కు రూ.5 లక్షల విద్యాకార్డు, విద్యార్థినులకు స్కూటీలతోపాటు యూత్ కమిషన్‌ను అమలు చేస్తామనిపేర్కొన్నది. కానీ.. వరుస రెండు బడ్జెట్లలోనూ వాటి ప్రస్తావనే లేదు.

కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అమలుపై ఏదైనా ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూడగా, బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేదు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణకు ప్రత్యేక చట్టం రూపకల్పనపై ప్రకటన వస్తే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశించారు. కానీ .. అది కూడా జరగలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూసిన డీఏ, పీఆర్సీ అమలునూ ప్రస్తావించలేదు.

విద్యకు నామమాత్రమే కేటాయింపులు: ఎస్టీయూటీఎస్

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు నామమాత్రపు కేటాయింపులే జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. కానీ.. వరుసగా రెండు సార్లు మాట తప్పడం బాధాకరం. 

ఫీజు బకాయిలే రూ.8 వేల కోట్లు: ఏఐఎస్‌ఎఫ్

ప్రభుత్వ, మాడల్, గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు ఉంటే బాగుండేదని ఏఐఎస్‌ఎఫ్ అభిప్రాయపడింది. విద్యకు సంబంధించి మొత్తంగా రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ప్రస్తావన బడ్జెట్‌లో లేదు.

26 వేల ప్రభుత్వ బడులు గాలికి : యూటీఎఫ్

విద్యాశాఖ పరిధిలోని 26,067 ప్రభుత్వ పాఠశాలలను సర్కార్ గాలికొదిలేసింది. రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌కు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో చదివే విద్యార్థులు 5.5 లక్షల మంది మాత్రమే. మిగిలిన వారంతా ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లోనే చదువుతున్నారు. వారి సంఖ్య 16 లక్షలు. వీరిలో అత్యధికశాతం మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే. వీరికి నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవు.

చిన్న రాష్ట్రాల్లోనూ అధిక కేటాయింపులు..

దేశంలో తెలంగాణ కంటే చిన్న చిన్న రాష్ట్రాలు కూడా స్టేట్ బడ్జెట్‌లో 10 శాతం కంటే ఎక్కువ నిధులు విద్యకు కేటాయిస్తున్నాయి. కానీ.. మన రాష్ట్రంలో మాత్రం  ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేటాయింపులు అంతంతమాత్రమే జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలో అప్పుటి ప్రభుత్వం విద్యారంగానికి 10.89 శాతం కేటాయింపులు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ ఎప్పుడూ కేటాయింపులు 10శాతానికి మించలేదు.