కన్నపేగును బలిగొన్న బెట్టింగ్
కోట్లలో అప్పులు చేసిన కొడుకు
ఆస్తి అమ్మి ఇవ్వాలని వేధింపులు
భరించలేక కొడుకును హత్య చేసిన తండ్రి
మెదక్, మే 12 (విజయక్రాంతి): కన్న కొడుకు జల్సాలకు, బెట్టింగులకు అలవాటు పడి.. కోట్ల రూపాయలు అప్పులు చేసి, వాటిని తీర్చడానికి కన్నవారిని వేధింపులకు గురి చేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో కొడుకును తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగిర్తిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. భాగిర్తిపల్లికి చెందిన సత్యనారాయణ రైల్వే ఉద్యోగిగా పనిచేశాడు.
సంపాదించిన డబ్బుతో మేడ్చల్‌లో ఇంటిని నిర్మించుకొని కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నారు. అతని కొడుకు ముఖేశ్ కుమార్ (28)కు రైల్వేలో ఉద్యోగం ఇప్పించాడు. జల్సాలకు, బెట్టింగులకు అలవాటు పడిన ముఖేశ్ విధులకు సక్రమంగా హాజరయ్యేవాడు కాదు. గత కొన్ని రోజులుగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో భారీగా బెట్టింగ్‌లు పెట్టి ఏకంగా రూ.2 కోట్ల వరకు అప్పులు చేసి పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి మేడ్చల్‌లో ఉన్న ఇంటిని అమ్మాలని తండ్రిని వేధించడం మొదలుపెట్టాడు.
దీంతో గ్రామంలో పంచాయతీ పెద్దల వద్ద గోడు వెల్లబోసుకున్నాడు. ఇదే విషయమై శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో వేధింపులు భరించలేకపోయిన సత్యనారాయణ ఇనుప రాడ్డు తో ముఖేశ్ తలపై బాది హత్య చేశా డు. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతునికి భార్య రజిత, మూడేళ్ల కూతురు ఉన్నారు.




