20 August, 2026 | 3:17 AM

ఖానాపురం పండ్ల మార్కెట్ యార్డుకు రూ.17.72 కోట్ల నిధులు

20-08-2026 12:00 AM

మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో పండ్ల మార్కెట్ యార్డు నిర్మాణానికి భారీగా నిధులు

31 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు.. నిధులు విడుదల

రోడ్లపై పండ్ల విక్రయాలతో ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు త్వరలో ఊరట

ఖమ్మం, ఆగస్టు 19 (విజయక్రాంతి): ఖమ్మం నగరం నడిబొడ్డులోని ఖానాపురం హవేలీ పరిధిలో నిర్మాణంలో ఉన్న పండ్ల మార్కెట్ యార్డుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. గతంలో దీని నిర్మాణ పనులు సగంలోనే నిలిచిపోవడంతో పండ్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్లపైనే పండ్లను విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

మంత్రి తుమ్మల కృషితో ఖానాపురం పండ్ల మార్కెట్ యార్డు నిర్మాణం, అభివృద్ధి పనులకు రూ.17.72 కోట్ల భారీ నిధులు మంజూరయ్యాయి. ఖానాపురంలో పండ్ల వ్యాపారులకు ప్రత్యేకంగా మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గతంలో నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ, పనులు పూర్తికాకపోవడంతో మార్కెట్ యార్డు వినియోగంలోకి రాలేదు. దీంతో పండ్ల వ్యాపారులు రోడ్ల పక్కనే వ్యాపారాలు నిర్వహించాల్సి వస్తోంది. వాహనాల రాకపోకలు, వర్షాలు, ఎండలు, పారిశుద్ధ్య సమస్యలు తదితర కారణాలతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు.

పండ్ల వ్యాపారులకు శాశ్వతంగా, అన్ని మౌలిక వసతులతో కూడిన మార్కెట్ యార్డు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మంత్రి తుమ్మల ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవ ఫలితంగా ఖానాపురం ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ యార్డు ఏర్పాటుకు, అభివృద్ధికి 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.1,772 లక్షలు అంటే రూ.17.72 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 31 అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.

ఈ పండ్ల మార్కెట్ యార్డులో వ్యాపారులు, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచేలా అభివృద్ధి పనులను రూపొందించారు. ఇందులో రూ.1.02 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ బ్లాక్-ఏ, మరో రూ.1.02 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ బ్లాక్-బి నిర్మించనున్నారు. అదేవిధంగా రూ.1.53 కోట్ల చొప్పున కమర్షియల్, ట్రేడర్స్ షాపుల బ్లాక్-ఏ, బ్లాక్-బి నిర్మాణానికి నిధులు కేటాయించారు.ప్రస్తుతం ఉన్న చిన్న ఆర్చ్ రూఫ్ షెడ్లను ట్రేడర్స్ షాపులుగా మార్చేందుకు రూ.99 లక్షలు, కొత్త కవర్ షెడ్ నిర్మాణానికి రూ.2.22 కోట్లు కేటాయించారు.

60 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎలక్ట్రానిక్ వెయింగ్ బ్రిడ్జి ఏర్పాటు కోసం రూ.26 లక్షలు, రైతుల విశ్రాంతి భవనం నిర్మాణానికి రూ.64 లక్షలు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి రూ.57 లక్షలు, 90 వేల లీటర్ల సామర్థ్యంతో ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.58 లక్షలు మంజూరయ్యాయి. పండ్ల మార్కెట్ యార్డు భద్రత, సౌకర్యాలు పెంచే చర్యల్లో భాగంగా చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.86 లక్షలు కేటాయించారు. యార్డు ప్రాంగణంలో సీసీ ఫ్లోరింగ్, రోడ్ల అభివృద్ధికి రూ.3.11 కోట్లు కేటాయించడం ద్వారా మార్కెట్లో రాకపోకలు, సరుకు తరలింపు మరింత సులభతరం కానుంది. ఇప్పటికే ఉన్న బిగ్ ఆర్చ్ రూఫ్ షెడ్లలో ట్రేడర్ల షాపుల ఏర్పాటుకు రూ.2.49 కోట్ల నిధులు కేటాయించారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో టవర్ లైట్ల ఏర్పాటుకు, యార్డు విద్యుదీకరణకు కూడా నిధులు మంజూరు చేశారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు, కమర్షియల్ మరియు ట్రేడింగ్ షాపులు, చిన్న ఆర్చ్ రూఫ్ షెడ్లు, కవర్ షెడ్, బిగ్ ఆర్చ్ రూఫ్ షెడ్లలోని షాపులకు విడివిడిగా విద్యుదీకరణ పనులు చేపట్టనున్నారు. మొత్తం మార్కెట్ యార్డులోని వివిధ బ్లాకులు, షాపింగ్ కాంప్లెక్స్లకు విద్యుత్ సదుపాయం కల్పించడం ద్వారా మార్కెట్ కార్యకలాపాలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.

పండ్ల వ్యాపారులకు శాశ్వత పరిష్కారం

ఖానాపురం పండ్ల మార్కెట్ యార్డు పూర్తయితే ప్రస్తుతం రోడ్లపై పండ్ల విక్రయాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. వ్యాపారులు ఒకే చోట సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడంతో పాటు, కొనుగోలుదారులకు కూడా మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది. మార్కెట్ యార్డులో షాపులు, కవర్ షెడ్లు, సీసీ ఫ్లోరింగ్, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, వెయింగ్ బ్రిడ్జి వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పండ్ల వ్యాపారాలకు మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.

సగంలో నిలిచిపోయిన పండ్ల మార్కెట్ యార్డు నిర్మాణాన్ని పూర్తి చేసి, వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి తుమ్మల చేసిన ప్రత్యేక కృషికి ఖానాపురం ప్రాంత పండ్ల వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను గుర్తించి ప్రభుత్వం ద్వారా రూ.17.72 కోట్ల నిధులు మంజూరు చేయించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

మార్కెట్ యార్డు పూర్తయితే ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న రోడ్లపై వ్యాపారాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వ్యాపారులు పేర్కొన్నారు. పండ్ల వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పించి, వారి వ్యాపార కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు. ఖానాపురం పండ్ల మార్కెట్ యార్డు నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరితగతిన వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.