న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న సీఆర్‌పీలు
13 ఏళ్లుగా పరిష్కారం కానీ
సీఆర్‌పీల సమస్యలు –
సీఆర్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు పాడ్య నాగేశ్వరరావు
దమ్మపేట, జూన్ 13(విజయక్రాంతి): సమగ్ర శిక్షలో గత 13 సంవత్సరాలుగా సీఆర్‌పీల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీఆర్‌పీ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పాడ్య నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనేక విద్యా సంవత్సరాలు గడిచినా మా సీఆర్‌పీల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు మారలేదని పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన సీఆర్‌పీలు ప్రతి ఏడాది నిరాశకు గురవుతున్నారని తెలిపారు.
బీఈడీ, టెట్ వంటి అర్హతలు కలిగి ఉన్నప్పటికీ, ఉపాధ్యాయుల స్థాయిలో కాకుండా కంప్యూటర్ నిర్వహణతో పాటు వివిధ పరిపాలనా పనులు చేస్తూ అధిక బాధ్యతలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రమకు తగిన వేతనం, ఉద్యోగ భద్రత లభించడం లేదని వాపోయారు. తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోయిందన్నారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేసి సీఆర్‌పీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా తమ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ న్యాయ పోరాటానికి రాష్ట్రము లోని సీఆర్‌పీలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.






