1 August, 2026 | 1:05 AM

బీఆర్‌ఎస్‌గా మారినప్పుడే సీఆర్‌ఎస్ ఖరారు

23-06-2024 01:32 AM
  1. రాజాసింగ్ స్వేచ్ఛను అధిష్ఠానం చూసుకుంటుంది

గొర్రెల స్కాంలో కేసీఆర్ విచారణ ఎదుర్కోక తప్పదు

హరీషే కాదు.. కేసీఆర్, కేటీఆర్ వచ్చినా బీజేపీలోకి ఆహ్వానిస్తాం

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే విజయం

‘మీట్ ది ప్రెస్’లో మెదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు

హైదరాబాద్, జూన్ 22(విజయక్రాంతి): టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారినప్పుడే వారికి ప్రజలు సీఆర్‌ఎస్ (కంపల్సరీ రిటైర్‌మెంట్ సర్వీస్) ఇచ్చారని, అక్కడి నుంచే వారి పత నం ప్రారంభమైందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మనుషులను మనుషులుగా చూడని ముఖ్యమంత్రులను వద్దని తెలుగు ప్రజలు నిరూపించారని తెలిపారు. అందుకే రెండో రాష్ట్రాల్లోనూ ప్రజలు అప్పటికే ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తగిన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో రఘునందన్ పలు అంశాలపై మాట్లాడారు. హరీష్‌రావు ఒక్కడే కాదు కేసీఆర్, కేటీఆర్ వచ్చినా తమ పార్టీలోకి స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు. గొర్రెల స్కాంలో కేసీఆర్ పేరు లేకుండా ఎండీ పేరిట కేసు నమోదు అయ్యిందని, అయితే అంతిమంగా ఈ కేసులో అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తాయన్నారు. ఈ స్కాంలో కేసీఆర్ విచారణను ఎదుర్కొనక తప్పదని తెలిపారు. పార్టీలో సీనియర్లను సంప్రదించి, వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షున్ని నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడిన అంశంపై స్పందిస్తూ... ఆయన స్వేచ్ఛను అధిష్ఠానం తప్పకుండా వింటుందని అన్నారు.

ఇందిరాగాంధీ వచ్చి పోటీ చేసిన తర్వాత మెదక్ అభివృద్ధి జరిగిందనడం ఉత్తమాట అని, అంతకు ముందే మెదక్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సహకారంతో మెదక్‌ను  అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రఘునందన్  తెలిపారు. మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ వస్తోందని, ఆ తర్వాత పరిశ్రమలను  నగరానికి దూరంగా తరలించేలా చూస్తామన్నారు. నీట్ అవకతవకలపై విపక్షాలవి దుష్ర్పచారాలని అన్నారు. పేపర్ లీక్ అంశం వాస్తవ దూరమైన విషయమని, ప్రతిపక్షాలు కేంద్రంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుని అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.  

మల్లన్నసాగర్ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం

పెండింగ్‌లో ఉన్న మల్లన్నసాగర్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని రఘునందన్ హామీ ఇచ్చారు. గతంలో మెదక్ కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకుపోయినా పరిష్కరించలేదని ఆరోపించారు. బీజేపీ నేతల పోరాటంతో రైతులకు రూ.13 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు పరిహారం వచ్చేలా చేసినట్లు తెలిపారు. కలెక్టర్‌గా పనిచేసి ఆ తరవాత రాజకీయ నాయకుడిగా మారిన వెంకట్ రాంరెడ్డి ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుని ధరణి స్లాట్స్ బ్లాక్ చేసి అనేక ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకున్నారని రఘునందన్ ఆరోపించారు. ములుగు మండలం క్షీరసాగర్‌లో 80 ఎకరాల భూమిని ఈ విధంగానే స్వాధీన పర్చుకున్నారని, అక్కడి నుంచే పేదలకు తిరిగి ఆ భూమిని ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కలా, అధికారం కోల్పొయి తరువాత మాట్లాడటం పరిపాటిగా మారిపోయిందని ఎంపీ రఘునందన్ తెలిపారు. కోల్ మైనింగ్‌కు సంబంధిచి పార్లమెంట్‌లో చేసిన చట్టానికి బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. సింగరేణికి సంబంధించి కేంద్రం వాటా 49 శాతం అని, రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతమని, నిర్ణయాలు తీసుకునే హక్కు రాష్ట్ర సర్కారుకే ఉంటుందని పేర్కొన్నారు. బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ నేతలతో బహిరంగ చర్చకు సిద్దమని రఘునందన్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు చేయకపోవడం వల్లే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్‌కు తరలివెళ్లిందని రఘునందన్ తెలిపారు.