పండగ చేయండి!
- రుణమాఫీ నిర్ణయంపై సర్వత్రా హర్షం
- వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్
- సంబురాలు చేపట్టాలని పీసీసీ పిలుపు
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రైతు రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పీసీసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని ప్లాన్ వేసింది. సర్కార్ నిర్ణయంపై పార్టీ నేతలతో పాటు రైతులు, అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కలిగేలా సంబురాలు నిర్వహించాలని శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మకమని, ఇంతటి ఘనత సాధించి, రైతాంగానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వ పనితీరును విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. 2004 లో కరీంనగర్‌లో తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చిందని, ఎన్ని అడ్డంకు లు వచ్చినా రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు.
ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం : కోదండరెడ్డి
వరంగల్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన మొదటి హామీ రూ. 2 లక్షల రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం హర్షనీయమని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి వర్గానికి కిసాన్ కాంగ్రెస్ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ నేత అన్వేష్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ..2014కు ముందు రాష్ట్ర అప్పు రూ. 72,658 కోట్లు ఉంటే.. కేసీఆర్ పదేళ్ల పాలనలో రూ. 6, 71,751 కోట్లకు చేరిందన్నారు. కేసీఆర్ కుటుంబానికి దోచుకోవడమే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అందరి సంక్షేమం దృష్టిలో పెట్టుకుని సమగ్ర మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందని కోదండరెడ్డి వివరించారు. ఇందిరా గాందీ హయాంలో రైతులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా బ్యాంకులను జాతీయం చేశారని తెలిపారు.
రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక : అన్వేష్‌రెడ్డి
ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర రైతాంగం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు. రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాన్న హరీష్‌రావు మాట మీద ఉంటారని అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. హరీష్‌రావు రాజీనామాతో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతుందని అన్వేష్‌రెడ్డి తెలిపారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.






