ఆదాయం పెంచేందుకు పంటలను సాగు చేయండి
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
భూత్‌పూర్, ఆగస్టు 19: రైతుల ఆదాయం పెంచడంతో పాటు నీటి వనరులు, భూసారాన్ని పరిరక్షించేందుకు ఉద్యానవన, తక్కువ నీటి వినియోగ పంటల సాగును ప్రోత్సహించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్ మండలం శేరిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్ సి.ఎం.డి జితేష్ పాటిల్ తో కలిసి జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులకు, గ్రామ సర్పంచ్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటల మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు. తక్కువ వర్షపాతం, భవిష్యత్ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే పంటలను ఎంచుకోవాలన్నారు. రైతులకు నాణ్యమైన కూరగాయల నారు, విత్తనాలు, మల్చింగ్, పందిళ్ల సాగు వంటి సదుపాయాలను ప్రభుత్వం అందిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కొత్తకోట సమీపంలోని శంకరెడ్డిపల్లిలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే మార్కెటింగ్ సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు. భూత్పూర్ లో విద్యుత్ సబ్డివిజన్ కార్యాలయంతో పాటు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అనిశ్చిత వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగు విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. అనంతరం శేరిపల్లి రైతులు వీరస్వామి, లక్ష్మయ్య సాగు చేస్తున్న కాకరకాయ, చిక్కుడుకాయ తోటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, గ్రామ సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు.






