12-11-2025 12:41:38 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), నవంబర్11: మండలంలోని పలు చోట్ల వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ యమపాశాలుగా దర్శనమిస్తు న్నాయి. చేయి పైకెత్తితే తగిలేంత ఎత్తులో తీగలు ఉండగా ప్రమాదం అంచునే రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. పొలాలకు వెళ్ళిన రైతులు ఆదమరిస్తే చాలు బతికే అవకాశమే లేనంతగా ఉంది కొన్ని చోట్ల పరిస్థితి. అయినా విద్యుత్ అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారంటూ రైతులే చెబుతున్నారు.
తీగలు సరి చేయాలని స్థానికంగా ఉండే విద్యుత్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని పలువురు వాపోతున్నారు. జాజిరెడ్డిగూడెం రెవెన్యూ శివారులో రామన్నగూడెం, బొల్లంపల్లి, అడివెంల రెవెన్యూ శివారులో కుంచమర్తి, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి.
కొన్ని చోట్ల మనిషి తలకు తగిలే ఎత్తులోనే ఉన్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితో అర్ధం చేసుకోవచ్చు. కిందకు వేలాడుతున్న తీగలతో అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు ఏమరుపాటుగా ఉండి చేయి పైకెత్తితే తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాణనష్టం జరగకముందే అధికారులు స్పందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.
చెప్పినా సరి చేయడం లేదు
నాకు జాజిరెడ్డిగూ డెం రెవెన్యూ శివారులోని రామన్నగూడెం వద్ద వ్యవసాయ పొలం ఉంది. అందులో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నాయి. వాటికింది నుంచి వెళితే తలకు తగిలేంత కిందికి ఉన్నాయి. పొలంలో పనిచేసే సమయంలో భయం వేస్తుంది. కరెంటు తీగలను సరిచేయాలని స్థానికంగా ఉండే విద్యుత్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా సరిచేయటం లేదు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదం జరగకముందే కొత్త స్థంభాలు వేసి తీగలు సరిచేయాలి.
రమావత్ విజయలక్ష్మి, రైతు రామన్నగూడెం
అతి త్వరలో పరిష్కరిస్తాం
విద్యుత్ సమస్యలు ఎక్కడున్నా వాటిని వెంట నే సరిచేసేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రామన్నగూడెం, అడివెంల శివారులోని వ్యవసాయ భూముల్లోని వైర్ల కింద వర్షపు నీరు అధికంగా ఉండి, బురద మయంగా మారింది. అతి త్వరలో కొత్త స్తంభాలు వేయించి విద్యుత్ వైర్లను సరిచేస్తాం.
శ్రీకాంత్, విద్యుత్ ఏఈ, జాజిరెడ్డి గూడెం.