దేశ సరిహద్దులు దాటి విస్తరిస్తున్న సైబర్ నేరాలు
- ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో అంతర్జాతీయ పోలీసుల సహకారం అవసరం
- మాజీ ఇంటర్పోల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మదన్ మోహన్ ఒబెరాయ్
రాజేంద్రనగర్, ఆగస్టు 31 (విజయ క్రాంతి): దేశ సరిహద్దులు దాటి విస్తరిస్తున్న సైబర్ నేరాలు, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలను అరికట్టడంలో అంతర్జాతీయ పోలీసుల సహకారం కీలకమని మాజీ ఇంటర్పోల్ (ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అధికారి డాక్టర్ ఎం.మదన్ మోహన్ ఒబెరాయ్ తెలిపారు. ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ లో సోమవారం 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో నిర్వహించిన ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్లో ఆయన మాట్లాడారు.
ఇంటర్పోల్ వ్యవస్థ, నేషనల్ సెంట్రల్ బ్యూరోస్ (ఎన్సీబీ) విధులు, అంతర్జాతీయ పోలీసు సహకారంలో వాటి పాత్రను వివరించారు. భారత్లో సీబీఐ.. ఇంటర్పోల్కు ఎన్సీబీగా వ్యవహరిస్తోందని తెలిపారు. రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, బ్లాక్, ఆరెంజ్ నోటీసుల ఉద్దేశాలు, వాటి ద్వారా నిందితులు, వాంటెడ్ వ్యక్తుల గుర్తింపు, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ, నేర సమాచార మార్పిడి వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ట్రస్ట్’తోనే సమర్థ పోలీసింగ్
ఇంటర్పోల్ విజన్-2030లో ‘ట్రస్ట్’కు అత్యంత ప్రాధాన్యత ఉందని ఒబెరాయ్ పేర్కొన్నారు. సమాచార విశ్వసనీయత, డేటా భద్రత, సాంకేతిక పరిజ్ఞానం, సంస్థల మధ్య సమన్వయం అంతర్జాతీయ నేరాల నియంత్రణకు అవసరమన్నారు. శిక్షణార్థులు అడిగిన దర్యాప్తు, ఇంటెలిజెన్స్ షేరింగ్, సాంకేతికత వినియోగంపై ప్రశ్నలకు తన అనుభవాలతో సమాధానమిచ్చారు.కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్, డీజీపీ అభిలాష్ బిస్త్ కోర్సు డైరెక్టర్ డాక్టర్ చేతన, కోర్సు కోఆర్డినేటర్ వేమా శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఫ్యాకల్టీ సభ్యులు, 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలు పాల్గొన్నారు.






