1 September, 2026 | 1:08 AM

అంచనాల కమిటీ చైర్మన్‌గా కోరం కనకయ్య బాధ్యతల స్వీకరణ

01-09-2026 12:32 AM

టేకులపల్లి, ఆగస్టు 31,(విజయక్రాంతి): తెలంగాణ శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్గా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన అధ్యక్షతన శాసనసభ కార్యాలయంలో అంచనాల కమిటీ సమావేశం ఘనంగా జరిగింది.

సమావేశానికి తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ ముఖ్య అతిథులుగా హాజరై కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపులు, వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రభుత్వ అంచనాలు  వ్యయాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

ప్రజా అవసరాలకు అనుగుణంగా నిధుల వినియోగం, ప్రభుత్వ నిధుల సద్వినియోగం, అభివృద్ధి ఫలాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని చర్చించారు. ప్రజా అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ నిధుల సద్వినియోగమే తన ప్రధాన లక్ష్యమని కమిటీ చైర్మన్ కోరం కనకయ్య తెలిపారు.

ఈ సమావేశంలో అంచనాల కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, సుదీర్ రెడ్డి, ఎమ్మెల్సీ యదవ రెడ్డితో పాటు శాసన సభ, శాసన మండలి ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.