ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలని సైకిల్ యాత్ర
మంచిర్యాల టౌన్, ఆగస్టు 14: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్ర వారం మంచిర్యాల ఐబి చౌరస్తా నుంచి హాజీపూర్ మండల కేంద్రం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42 శాతం పెంచి వాటిని ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరిస్తామని చెప్పి విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేండ్లవుతున్నా బీసీ డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని అమలు చేసిన పాపాన పోలేదన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రజావాణి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మహేష్ వర్మ, జిల్లా నాయకులు పడాల శివతేజ, భీమిని రమేష్, మహమ్మద్ లతీఫ్, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మంచర్ల సధానందం, రజక సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు తంగళ్ళపెల్లి బాపు, బీసీ నాయకులు సూరయ్య, వేముల కిరణ్, కీర్తి బిక్షపతి, న్యాయవాది కొట్టె నటేశ్వర్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.






