28-11-2025 12:33:36 PM
కొలంబో: దిత్వా తుపాన్(Cyclone Ditwah) శ్రీలంకను అతలాకుతలం చేసింది. దిత్యా తుపాను ప్రభావంతో శ్రీలంకలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయి. వరదల్లో ఇప్పటికే 56 మంది మృతి చెందగా, 21 మంది గల్లంతయ్యారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు వెల్లడించారు. శ్రీలంకలోని ట్రింకోమలికి 40 కిలో మీటర్ల దూరంలో దిత్యా తుపాన్ కేంద్రీకృతం అయినట్లు అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో శ్రీలంకకు వెళ్లాల్సిన విమానాలు కొచ్చి, త్రివేండ్రం విమానాశ్రయాలకు మళ్లించారు. నైరుతి బంగాళాశాతంలో దిత్వా తుపాన్ కొనసాగుతోంది. ట్రింకోమలికి 40, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 430, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలో మీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతం అయింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 10 కిలో మీటర్ల వేగంతో దిత్వా కదులుతోందని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర వాయవ్య దిశగా తుపాన్ కదులుతోంది. ఎల్లుండి ఉదయానికి తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలను చేరే అవకాశముంది. కోస్తాంధ్ర తీరంలో 35-45 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొన్నారు.