calender_icon.png 28 November, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

28-11-2025 10:39:15 AM

పాత–కొత్త వర్గాల పంచాయితీ  

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాత–కొత్త వర్గాల మధ్య నెలలుగా మండుతున్న అంతర్గత కలహాలు గ్రామపంచాయతీ ఎన్నికల టికెట్ కేటాయింపులతో భగ్గుమన్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఒత్తిడుల్లోనూ పార్టీని నిలబెట్టిన సీనియర్ నేతలను పక్కనబెట్టి, ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు సీనియర్ వర్గం తీవ్రంగా చేస్తున్నది. అయితే అందరినీ కలుపుకొని పోతున్నానని, పాత–కొత్త కాంగ్రెస్ అనే తేడా లేదని ఎమ్మెల్యే చెప్పినా, టికెట్ కేటాయింపుల్లో వర్గ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సీనియర్ నేతలు వాదిస్తున్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌తో టికెట్ల కోసం రెండు వర్గాల మధ్య పోటీ తీవ్రతరం కావడంతో, తుది నిర్ణయం ఎమ్మెల్యేకే ఉండటంతో ఆయనతో ఉన్నవారే ఎక్కువగా వెళ్లబెట్టబడుతున్నారనే ఆరోపణలు మిన్నంటాయి. 40 ఏళ్లుగా పార్టీకి నమ్మకంగా పనిచేసిన నాయకులను కనీసం పట్టించుకోకుండా తన అనుచరులకు ఇష్టానుసారంగా టికెట్లు కేటాయిస్తున్నారని కట్టంగూర్ మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నర్సింహ మండిపడ్డారు. కట్టంగూర్ మండలంలో పాత కాంగ్రెస్ నాయకులను పూర్తిగా పక్కనబెట్టి మొత్తం టికెట్లు ఒకే వర్గానికిచ్చి, ఇన్‌చార్జిగా కూడా ఎమ్మెల్యే వర్గానివారినే పెట్టడంతో మండల రాజకీయం ఒక్కసారిగా రచ్చకెక్కింది.

ఈ పరిణామాలపై బహిరంగ సమావేశాలు నిర్వహించిన సీనియర్ వర్గం, స్థానిక ఎన్నికల్లో తామూ సమానంగా పోటీలో ఉంటామని స్పష్టం చేస్తూ, జరుగుతున్న అన్యాయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించింది. ఎమ్మెల్యే వీరేశం నియోజకవర్గంలో నియంతృత్వంగా వ్యవహరిస్తూ, గ్రామ–మండల నాయకుల అభిప్రాయాలను పరిగణించకుండా 22 గ్రామాలకు తన సొంత అభ్యర్థులను ప్రకటించడం పార్టీ పట్ల అవమానమని నేతలు ఆరోపించారు. అద్దె నాయకులను నమ్మవద్దని, నిజమైన కాంగ్రెస్ శ్రేణులు నామినేషన్లు వేయాలని పాత కాంగ్రెస్ వర్గం పిలుపునివ్వడంతో అంతర్గత యుద్ధం మరింత ముదిరింది. పంచాయతీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో ఈ పాకానపడ్డ విభేదాలు ఏ దిశకు దారి తీస్తాయోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.