ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ ప్రకటించాలి
- ఎన్‌ఈపీ-ను రాష్ట్రంలో అమలు చేయాలి
- మోడల్, కస్తూర్బా టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి
- శాసనమండలిలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉద్యోగులకు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇంత వరకూ పీఆర్సీ ఇవ్వలేదని, వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విజ్ఞప్తి చేశారు. తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయన మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)ను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో వచ్చే నిధులతో ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు, పాఠశాలల్లో మౌలిక వసతులు అందుతాయన్నారు.
మోడల్ స్కూల్స్, కస్తూర్బా విద్యాలయాల్లో ఉపాధ్యాయులు చాలా ఏండ్లుగా తక్కువ వేతనాలకే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని, వారికి పే స్కేలు అమలు చేయడంతోపాటు వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి.. వారికి 010 పద్దు ద్వారా వేతనాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
2024-25 అకడమిక్ ఇయర్‌లో మన రాష్ట్రంలో 2,245 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని, విద్యార్థులు ఉన్న చోట టీచర్ల కొరత ఉన్నది.. టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేరు.. కాబట్టి రేషనలైజేషన్ చేయాలని కోరారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ చెల్లించలేదని, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.






