27 March, 2026 | 4:45 AM

అడ్డా కూలీ దారుణ హత్య?

27-03-2026 02:31 AM

మేస్త్రీ వద్ద డబ్బులకు వెళుతున్నానని వెళ్లి శవమై

జవహర్‌నగర్, మార్చి 26 (విజయక్రాంతి): జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని దమ్మాయిగూడలో ఓ అడ్డా కూలి దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్ మండలం మంగళపల్లి గేట్ సమీపంలోని చిన్న కేశవ కాలనీకి చెందిన డి. విజయ(35) నగరానికి వలస వచ్చి జవహర్ నగర్ లోని దేవేందర్ నగర్ లో, 15 ఏండ్ల ఇద్దరు పిల్లలు శివ, చరణ్తో కలిసి నివసిస్తుంది.

విజయ ప్రతిరోజు దమ్మాయిగూడ లోని మేస్త్రి అడ్డ వద్దకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈనెల 25వ తేదీన మేస్త్రి వద్ద డబ్బుల కోసం వెళుతున్నానని ఇంట్లో చెప్పి రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం కుటుం బ సభ్యులు చుట్టుపక్కల వెతికినా తెలిసిన వారి వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు దమ్మాయిగూడ లోని మనీషా వైన్ షాప్ వెనకాల ఓ మృతదేహం పడి ఉందని కుటుంబ సభ్యులైన లక్ష్మికి గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చింది.

వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతురాలు విజయగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ధావకానకు తరలించారు. గత కొంతకాలం గా బాలస్వామి అనే వ్యక్తి విజయను వేధిస్తున్నాడని అతనే హత్య చేసి ఉంటాడని శరీరం పై గాయాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్నారు.