13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

నేటి నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు ప్రారంభం

27-03-2026 02:32 AM

విజయక్రాంతి ఎఫెక్ట్ 

కేసముద్రం, మార్చి 26 (విజయక్రాంతి): ఎట్టకేలకు మక్కజొన్నలు పండించిన అన్నదాతలకు మద్దతు ధర అందించడానికి మార్క్ ఫెడ్ సంస్థ రంగంలోకి దిగనుంది. యాసంగి సీజన్ లో రైతులు సాగుచేసిన మొక్కజొన్న పంట ఉత్పత్తులు దిగుబడి వస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ట్రేడర్లు క్వింటాలుకు 1800 రూపాయలకు మించి ధర పెట్టకపోవడంతో, క్వింటాలకు 600 రూపాయలు నష్టపోవాల్సి వస్తుండడం, మద్దతు ధర లభించక మొక్కజొన్న పంట పండించిన రైతులు నష్టపోతున్న అంశాన్ని వివరిస్తూ ఈనెల 11న ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచూరించడం జరిగింది.

ఈ నేపథ్యంలో మహబూబాబాద్, ఇల్లందు ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్యా మురళి నాయక్, కోరం కనకయ్య తమ నియోజకవర్గ పరిధిలో మొక్కజొన్నలు పండించిన రైతులు మద్దతు ధర లభించక నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా రెండు నియోజకవర్గాల పరిధిలో మక్కజొన్నల కొనుగోళ్లకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా పరిధిలో శుక్రవారం కేసముద్రం, మహబూబాబాద్, ఇనుగుర్తి, నెల్లికుదురు, గూడూరు, బయ్యారం, గార్ల మండలాల్లో మక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

దీనితో మొక్కజొన్నలు పండించిన రైతులకు క్వింటాలుకు 2400 రూపాయలు చొప్పున మక్కలు కొనుగోలు చేస్తారు. 14 శాతం తేమ మించకుండా బాగా ఆరబెట్టి తేవాలని, అలాగే ఏఈవో ద్వారా పంట విక్రయం కోసం టోకెన్ తెచ్చుకోవాలని, బ్యాంకు ఖాతా, పట్టా పాస్ పుస్తకం, లింకు చేసిన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను రైతులు మక్కలు విక్రయించే సమయం లో వెంట తెచ్చుకోవాలని కేసముద్రం మక్కల కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.