calender_icon.png 25 September, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీరు ముట్టుకుంటే మా దుర్గామాత మైల పడ్తది..!

25-09-2025 11:52:41 AM

దుర్గామాత వద్దకు రావద్దని దళితులకు ఆంక్షలు. 

పోలీసులు సర్ది చెప్పినా వినని వైనం.

 తెలకపల్లి మండలం జంగమోనిపల్లిలో ఘటన.

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): మీరు ముట్టుకుంటే మా దుర్గామాత మైల పడ్తది.. మీరు ఎంగిలి తినేవాళ్లు ఇక్కడికి రావద్దు అంటూ ఆ గ్రామానికి చెందిన కొందరు బీసీ కులస్తులు దళిత కులస్తులను దుర్గామాత దర్శనాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) తెలకపల్లి మండలం జంగం మోనిపల్లి గ్రామంలో వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలోని దుర్గాదేవి పూజా కార్యక్రమాల్లో అందరితోపాటు ఆ గ్రామానికి చెందిన దళిత కాలనీవాసులు హాజరయ్యారు.

కాగా, అక్కడే ఉన్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, మరికొంత మంది ఇతర కులస్తులు దళితులంతా ఇతరుల ఎంగిలి తినేవాళ్లు మీరు ముట్టుకుంటే మా దుర్గామాత మైల పడ్తది.. ఇక్కడికి రావద్దంటూ చెప్పడంతో తీవ్ర అవమానానికి గురయ్యారు. దీంతో మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాల వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది ఇతర కులస్తులు దళితులను దర్శనానికి రానిచ్చే ప్రసక్తే లేదంటూ పోలీసుల ముందే చెప్పడంతో షాకయ్యారు. చట్టాలు, శిక్షలు కఠినంగా అమలు అవుతాయని మనుషులంతా ఒక్కటే అనవసరమైన గొడవలకు దిగొద్దంటూ పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో దళితులు తమకు అవమానం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ నరేష్ వివరణ కోరగా గ్రామంలోని కొంత నిరక్షరాస్యులు అవగాహన రాహిత్యం వల్ల ఇలా జరిగిందని వారికి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.