calender_icon.png 25 September, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వగ్రామానికి మావోయిస్ట్ అగ్రనేత కోసా మృతదేహం

25-09-2025 11:43:05 AM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి మండలంలోని గోపాల్ రావు పల్లి గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత కడారి సత్యనారాయణరెడ్డి(Kadari Satyanarayana Reddy) అలియాస్ కోసా మృతిచెందాడు. విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన కాంబింగ్ ఆపరేషన్‌లో ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకోగా, అందులో కోసా హతమైనట్లు పోలీసులు ధృవీకరించారు. కోసా గత కొన్ని దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమానికి వ్యూహరచనకర్తగా, సెంట్రల్ కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యునిగా కీలకపాత్ర పోషించారు. ఆయన తలపై భారీ బహుమతి ప్రకటించడంతో పాటు, భద్రతా సంస్థలు అతడిని అత్యంత వాంటెడ్ నాయకుడిగా గుర్తించాయి.

ఎన్‌కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు కోసా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, అధికారుల పర్యవేక్షణలో స్వగ్రామానికి తరలించారు. ఆయన మృతదేహం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని గోపాల్రావుపల్లి గ్రామానికి చేరుకుంది. అక్కడ కుటుంబ సభ్యులకు అప్పగించగా, అంత్యక్రియలు గ్రామంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. కోసా మరణంతో మావోయిస్ట్ ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలిందని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన అనుచరులు, మద్దతుదారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవగా, స్థానిక గ్రామ ప్రజలు కూడా విభిన్న భావోద్వేగాలతో స్పందిస్తున్నారు.