25-09-2025 11:02:14 AM
హైదరాబాద్: ప్రముఖ రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్( Venkatesh Goud Kompelli) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొంపెల్లి వెంకట్ గౌడ్ ఆస్పత్రిలో తదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ హఠాన్మరణం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao ) అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ మనో గతానికి 'వొడువని ముచ్చట' గా, ఆర్ విద్యాసాగర్ రావు ఆలోచనలకు 'నీళ్ల ముచ్చట' గా పుస్తక రూపం ఇచ్చారని కొనియాడారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనల ద్వారా చాటి, సర్వాయి పాపన్న చరిత్రను అక్షర బద్దం చేసి ప్రజలకు అందించారని గుర్తుచేశారు. తెలంగాణ తత్వం, ఉద్యమ భావజాలాన్ని తన కలంలో నింపుకున్న కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతి తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటని హరీశ్ రావు పేర్కొన్నారు. కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.