శిల్పారామంలో నృత్య వైభవం
ప్రేక్షకులను మైమరపించిన కళాకారులు
శేరిలింగంపల్లి, జూలై 25 (విజయక్రాంతి): మాదాపూర్ శిల్పారామంలో ప్రతి వారాంతంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కళాభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. శనివారం నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. భరతనాట్య కళాకారిణి ఐశ్వర్య లక్ష్మి సంప్రదాయ నృత్య రీతిలో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. ఆమె ’ఝేమ్ ఝేమ్’ పుష్పాంజలి, కామాక్షి స్వరజతి, పదం, శివరంజని తిల్లానా నృత్యాంశాలను భావప్రకటన, లయబద్ధతతో ప్రదర్శించి సభికుల ప్రశంసలు అందుకున్నారు.అనంతరం ప్రముఖ నృత్య గురువు డాక్టర్ బిందు అభినయ్ శిష్యబృందం కూచిపూడి నృత్య రూపకాలను అద్భుతంగా ఆవిష్కరించింది.
జతిస్వరం, దశావతార శబ్దం, అంబ నీరాజనం, నీలమేఘ శరీర, భజ మానస, డోలాయంచాల, చక్కని తల్లికి, గరుడ గమన, కృష్ణం కలయ సఖి, దశావతార వరద, జయము జయము వంటి అంశాలను శిష్యులు సమన్వయంతో ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.ఈ ప్రదర్శనల్లో అన్విత, షణ్ముఖి, సంహిత, ఈషా, తన్మయీ, హరిణి, భవాని, మేధా, పూజిత, అనఘా, హంసిని, ఆధ్య, మనస్విని, ప్రతుల్య తదితరులు పాల్గొని తమ నృత్య నైపుణ్యాన్ని చాటుకున్నారు.కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రేక్షకులు కళాకారులను అభినందించగా, శిల్పారామం వేదికగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు.






