ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు
- ప్రాణాలు పోయాకే స్పందిస్తారా..?
- విద్యుత్ శాఖపై రైతుల ఆగ్రహం
చెన్నూర్, ఆగస్టు 30 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట నుంచి సుద్దాల సబ్స్టేషన్కు వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు ఏ స్తంభం నేలకూలుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో పంట పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు బలహీనంగా ఉండటంతో పాటు ప్రమాదకర స్థితిలో కనిపిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పనులు చేసుకునేందుకు వెళ్లే సమయంలో స్తంభాలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్తంభాలు కూలితే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా గాలులు, వర్షాలు వచ్చిన సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ప్రమాదకరంగా ఉన్న 33 కేవీ స్తంభాలను వెంటనే మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు మండిపడుతున్నారు. ప్రాణ నష్టం జరగకముందే అధికారులు మేల్కొని తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.






