02-11-2025 06:36:53 PM
కీసర (విజయక్రాంతి): కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవానీ శివ దుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారిని శృంగేరి శారదాపీఠం జగద్గురు శ్రీ విధూశేఖర భారతి మహాస్వామి ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగద్గురు విధూశేఖర భారతి మహాస్వామి గర్భగుడిలో కొలువై ఉన్న రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పూజల అనంతరం భక్తులను ఉద్దేశించి స్వామివారు ప్రవచనాలు వినిపించారు. ధర్మం, వేదాల ప్రాముఖ్యత, మానవ జీవితంలో ఆధ్యాత్మిక చింతన ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సందర్భంగా స్వామివారు గతంలో కీసరగుట్టలోని వేద పాఠశాలలో విద్యనభ్యసించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. స్వామివారి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగద్గురువుల ఆశీర్వాదం తీసుకుని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, కార్య నిర్వహణాధికారిలు పాల్గొన్నారు.