calender_icon.png 27 November, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘దస్తకర్ హైదరాబాద్ బజార్’ ప్రారంభం

27-11-2025 12:00:00 AM

డిసెంబర్ 2వరకు ఈ ఎక్స్‌పో

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): హస్తకళలకు ఎంతో ప్రసిద్ధి చెందిన ’దస్తకర్ హైదరాబాద్ బజార్’ ఎక్స్‌పోను అమీర్‌పేట రోడ్డులో ఉన్న కమ్మ సంఘం హాల్‌లో బుధవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ ఎక్స్‌పో డిసెంబర్ 2 వరకు జరగనుంది. ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం పదకొండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ.. దస్తకర్ 1981లో ప్రారంభమైందన్నారు. అప్పట్లో భారతదేశంలో హస్తకళలకు ఆదరణ లేదన్నారు.

ఇందిరాగాంధీ హయాంలో హస్తకళలకు ఆదరణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ దస్తకర్ ను ఏర్పాటు చేశారన్నారు. చేనేత కళాకారులను ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. దస్తకర్ ప్రతినిధి షెల్లీ జైన్ మాట్లాడుతూ.. ఈ ఎక్స్‌పోలో 75 పైగా స్టాల్స్ కలవన్నారు. నాలుగు దశాబ్దాలుగా హస్తకళాకారుల సేవలో ఉన్నామన్నారు. ఈ ఎక్స్పోలో పూర్తిగా చేతితో తయారు చేసిన వస్తువులు మాత్రమే ఉన్నాయన్నారు. చేనేత వస్త్రాలు, కుండలు, తోలు పాదరక్షలు, ఆభరణాలు, ఎంబ్రాయిడరీ ఉన్నాయని తెలిపారు.