calender_icon.png 9 February, 2026 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రికి అంత్యక్రియలు చేసిన కూతుళ్లు

09-02-2026 01:29:47 AM

అశ్వాపురం, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): మండలంలోని చింతిర్యాల కాలనీ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జక్కుల చంద్రం, శాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదనంగా, తన తమ్ముడు మరణించడంతో ఆయన కుమార్తెను చిన్ననాటి నుంచే తమ సొంత కూతురిలా పెంచి పెద్ద చేసి వివాహం కూడా జరిపించారు. పెద్ద కుమార్తె జక్కుల సువార్త, రెండవ కుమార్తె కరుణ, అలాగే తమ్ముడు కుమార్తె అఖిలను ఎంతో కష్టపడి కూలి పనులు చేస్తూ పెంచి వివాహాలు నిర్వహించారు.

అయితే ఇటీవల జక్కుల చంద్రం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ శనివారం మృతి చెందారు. కుమారులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ముగ్గురు కుమార్తెలే ఆదివారం అంత్యక్రియలు నిర్వహించి తండ్రిపట్ల తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామస్తులు, పెద్దమనుషులు, ఉప సర్పంచ్ సహా పలువురు సహాయ సహకారాలు అందించి అంత్యక్రియలు నిర్వహించడంలో తోడ్పాటునిచ్చారు. కష్టాల్లో కూడా తండ్రికి విధివిధానాలతో అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలను గ్రామస్తులు ప్రశంసించారు.