ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి
- రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలపై అవగాహన కల్పించాలి
- నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి, జూన్ 12 : సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో వేగం పెంచాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, బాధితులకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు.
లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ఇన్వెస్టిగేషన్లో సందేహాలు ఉంటే ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలన్నారు. పోలీసు స్టేషన్కు వచ్చిన ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడి, వారికి భరోసా కల్పించాలన్నారు. ఎస్.హెచ్.ఓలు తమ పరిధిలోని ప్రతి గ్రామానికి విలేజ్ పోలీసు అధికారిని నియమించాలని, ఆయా గ్రామాలలో రౌడీ షీటర్లు, కేడీలు, సస్పెక్ట్లను తరచూ తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు.
విలేజ్ పోలీసు అధికారులు ఆయా గ్రామాలలో ముందస్తు సమాచారాన్ని సేకరించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచాలన్నారు. వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి కాష్ రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేయడం జరిగింది.
వాహనాలను పరిశుభ్రంగా ఉంచిన డ్రైవర్లకు ఎస్పీ రివార్డులను ప్రకటించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్ రావు, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, ఫింగర్ప్రింట్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ మరియు జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సబ్‌ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.






