8 May, 2026 | 1:04 AM

పేదరికాన్ని జయించి ‘డాక్టర్’ అయిన చైతన్య సాయి

08-05-2026 12:00 AM

డీసీఎం డ్రైవర్ కొడుకు అద్భుత విజయం

ప్రభుత్వ పాఠశాల నుంచి మెడికల్ కాలేజ్ వరకూ

తల్లిదండ్రుల త్యాగానికి గర్వకారణమైన కుమారుడు

ఖమ్మం, మే 7 (విజయక్రాంతి): కష్టపడి చదివే గుణం, కన్నవారి కష్టాన్ని తీర్చాలనే తపన ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా ముద్దాడవచ్చని ఖమ్మం బిడ్డ నామవరపు చైతన్య సాయి నిరూపించారు. ఖమ్మం నగరంలోని జహీర్పుర, గుట్టల బజార్ ప్రాంతానికి చెందిన నామవరపు చైతన్య సాయి తన కృషి, పట్టుదల, చదువుపట్ల ఉన్న మక్కువతో డాక్టర్గా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని మహబూబ్నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ యువకుడు బుధవారం సాయంత్రం డాక్టరేట్ పట్టా అందుకొని తన తల్లిదండ్రుల కలలను నిజం చేశాడు. తల్లి నామవరపు రేణుక గృహిణిగా, తండ్రి నామవరపు కోటయ్య డీసీఎం డ్రైవర్గా ఎన్నో కష్టాలు పడుతూ కుమారుడిని చిన్ననాటి నుంచే ప్రభుత్వ పాఠశాలలో చదివించారు.

ఆర్థిక ఇబ్బందులు అడుగడుగునా ఎదురైనా, చదువే భవిష్యత్తు అనే నమ్మకంతో కుమారుడి విద్య కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగం చివరకు ఫలించింది. చిన్నప్పటి నుంచే చదువులో మెరిట్ విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్న చైతన్య సాయి, క్రమశిక్షణతో చదువుకుంటూ ప్రతి తరగతిలోనూ ప్రత్యేక ప్రతిభ కనబరిచేవాడు. పెద్దల పట్ల గౌరవం, లక్ష్యంపై అచంచల నమ్మకం, కష్టపడే స్వభావం అతడిని ఈ స్థాయికి తీసుకు వచ్చాయి. దళిత కుటుంబానికి చెందిన చైత న్య సాయి ఎంతో పోరాటం చేసి మెడికల్ సీట్ సాధించాడు. 

డాక్టరేట్ పట్టా అందుకున్న క్షణంలో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో కష్టాలను భరించి చదివించిన తమ కుమారుడు డాక్టర్గా ఎదగడం చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. గుట్టల బజార్ ప్రాంతంలోనూ ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. స్థానికులు, బంధువులు, స్నేహితులు చైతన్య సాయికి శుభాకాంక్షలు తెలుపుతూ అతని విజయాన్ని గర్వంగా కొనియాడారు.