అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ
అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకే...
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపల్లెవాడ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్‌పోస్ట్ (INTER DISTRICT CHECK POST)ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ (DCP AGGADI BHASKAR) సోమ వారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని,భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకే...
బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు చెక్ పోస్టలు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను చేపట్టామని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. అక్రమ పశువుల రవాణాపై పటిష్ట నిఘా కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, అనుమానాస్పద రవాణా గమనించినట్లయితే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. డీసీపీ వెంట తాండూర్ సీఐ దేవయ్య, బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు, తాండూర్ ఎస్‌ఐ ప్రసాద్ తదితరులున్నారు.






