3.38 కోట్ల ఫారాలు.. అందినవి 2.64 కోట్లే!
- 74 లక్షల మంది నుంచి అందని ఎన్యూమరేషన్ ఫారాలు
- ఫారాల స్వీకరణకు ముగిసిన గడువు
- 94.30 శాతంతో యాదాద్రి టాప్
- హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు వెనుకంజ
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా, 2,64,30,494 ఫారాల డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయింది. ఇంకా దాదాపు 69 లక్షల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించలేదు. ఇల్లు మారడం, అందుబాటులో లేకపోవడం, మరణించిన ఓటర్లు, నకిలీ ఓట్ల కారణంగా పూర్తిస్థాయిలో ఫారాలు అందలేదని అధికారులు భావిస్తున్నారు.
బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించే ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగియగా, సేకరించిన ఫారాల డిజిటలైజేషన్ కూడా పూర్తి చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలో కూడా 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేయగా, అందులో దాదాపు 69 లక్షల మంది ఓటర్లు ఫారాలు సమర్పించ లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా సగటున 78.14 శాతం డిజిటైజేషన్ పూర్తయినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా 94.30 శాతం డిజిటలైజేషన్‌తో మొదటి స్థానంలో ఉండగా, గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలు వెనుకబడ్డాయి. హైదరాబాద్ జిల్లాలో 48 లక్షల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయగా, అందులో 28 లక్షల మంది మాత్రమే తిరిగి ఫారాలు సమర్పించారు. డిజటలైజేషన్ 60 శాతం కూడా దాటలేదని తెలిసింది.
మేడ్చల్ మల్కాజ్‌గిరి , రంగారెడ్డి జిల్లాలోనూ డిజిటలైషన్ తక్కువగా నమోదైంది. గ్రేటర్ హైదరబాద్ పరిధిలో సుదీర్ఘకాలంగా నివాసం ఉంటున్న ఓటర్లలో చాలా మంది స్వగ్రామాల్లో ఓటు హక్కును ఉంచుకోవడానికి మొగ్గు చూపడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పించేందుకు ఎన్నికల కమిషన్ ఏడు రోజుల గడువు పొడిగించినా నాలుగు శాతం లోపే పెరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఇంటింటికి వెళ్లి ఫారాల స్వీకరణ
ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసిన ఓటర్ల నుంచి అంతంతమాత్రంగానే స్పందన లభించింది. దీంతో బీఎల్‌వోలు సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఇంటింటికీ వెళ్లి ఫారాలు సేకరించారు. అయినా అయినా చాలా మంది పారాలు తిరిగి ఇవ్వలేదు. సవరణలు, పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా ఫారాల డిజిటలైజన్ పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా ఈ నెలలోనే డ్రాప్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.






