18 July, 2026 | 8:21 AM

కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం 49 మంది సజీవ దహనం

13-06-2024 01:24 AM

బతకనీకి పోయి.. బుగ్గిపాలయ్యె!

పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువుకు వలస పోయిళ్లు.. పిల్లపాపలను వదిలి పది పైసలు ఎనకేసుకుంటానికి ఇమానం ఎక్కిళ్లు.. రాత్రి పగలు తేడా లేకుంట.. గొడ్డు కష్టం చేసిళ్లు.. తిండి టిఖానా లేకపోయినా.. నిద్ర లేకపోయినా.. అవ్వ, నాయిన.. పెళ్లాం, పిల్లల కోసమేగా అని కన్నీళ్లను కడుపులో దాచుకున్నరు.. మరి వీళ్ల కష్టం దేవుడికి కనపడలేదేమో.. వారు ఉంటున్న భవనాన్ని అగ్గి దహించింది. ప్రాణాలు బుగ్గిపాలు చేసింది. దేశంకాని దేశం కువైట్‌లో బుధవారం ఘోరం జరిగింది. 

మృతుల్లో 4౧ మంది భారతీయులే

కేరళకు చెందినవారు 11 మంది

50 మందికిపైగా తీవ్ర గాయాలు

మంగాఫ్‌లోని ఆరంతస్తుల భవనంలో మంటలు

ఉదయం ఆరు గంటల ప్రాంతంలో దుర్ఘటన

తొలుత కిచెన్‌లో అంటుకున్న మంటలు

క్షణాల్లోనే భవనం మొత్తం వ్యాప్తి

ప్రమాద సమయంలో భవనంలో 195 మంది

న్యూఢిల్లీ, జూన్ 12: అరబ్ దేశం కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో మంటలు చెలరేగి ఏకంగా 49 మంది అగ్నికి ఆహుత య్యారు. వీరిలో 4౧ మంది భారతీయులే కావడం విషాదకరం. మృత్యువాత పడిన వారిలో కేరళకు చెందిన వారు 11 మంది ఉన్నారు. జీవనోపాధి కోసం సొంతూళ్లకు దూరంగా వచ్చి కంపెనీలో పని చేసుకుంటున్న వీరంతా ఇలా దురదృష్టవశాత్తూ దుర్మరణం పాలయ్యారు.

దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలోని ఆరు అంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనం కువైట్‌లోని అతిపెద్ద భవన నిర్మాణ సంస్థ ఎన్‌బీటీసీకి చెందినది. అక్కడి కాలమానం ప్రకారం.. ఉదయం ఆరు గంటల సమయంలో ఓ కిచెన్ నుంచి మంటలు చెలరేగినట్టు స్థానిక మీడియా చెబుతోంది. ప్రమాద సమయంలో భవనంలో 195 మంది వరకు ఉన్నారు.

వీరంతా ఎన్‌బీటీ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. కాసేపటికే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో 35 మంది అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన వారిలో 4౧ మంది భారతీయలు ఉన్నారు. మరో 50 మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో దాదాపు 30 మంది భారతీయులే. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది నిద్రలోనే ఉన్నారని, దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. 

విదేశాంగ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి 

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 49 మందికిపైగా మరణించారని, 50 మందికిపైగా గాయపడి ఆస్పత్రిలో చేరినట్లు తెలిసినట్లు వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కువైట్‌లోని భారత రాయబారి సంఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

యజమానిని అరెస్టు చేయండి..

అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కువైట్ మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సందర్శించారు. భవన నిర్మాణ సంస్థ ఎన్‌బీటీసీ యజమాని, భవనాన్ని చూసుకునే వ్యక్తి ఈ అగ్ని ప్రమాదానికి బాధ్యులని, వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. కంపెనీ, భవనం యజమానుల దురాశ వల్లే ఇలా జరిగిందని మంత్రి దుయ్యబట్టారు. కాగా, భారత సంతతికి చెందిన కేజీ అబ్రహం ఎన్‌బీటీసీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకడు.

మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అగ్ని ప్రమాదంపై మోదీ సమీక్ష నిర్వహించారు. కువైట్‌లో చికిత్స పొందుతున్న వారికి అన్ని రకాల సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ హుటాహుటిన కువైట్ బయల్దేరి వెళ్లారు. చనిపోయిన వారి మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు ఆయన అక్కడే ఉండి ఏర్పాట్లు చేయనున్నారు.