ఆర్మీ కొత్త బాస్‌గా ఉపేంద్ర ద్వివేదీ
30న బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ, జూన్ 12 : నూతన ఆర్మీ ఛీప్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ఆర్మీ ఛీప్ జనరల్ మనోజ్ పాండే ఈ నెల 30న పదవీ విరమణ చేస్తుండగా.. అదే రోజు ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ అధికారిక ప్రకటన వెల్లడించింది. ప్రస్తుతం ద్వివేదీ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ 1964 జులై 1న జన్మించారు.
మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అమెరికా ఆర్మీ వాల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. డిఫెన్స్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంఫిల్, స్ట్రాటజిక్ స్టడీస్ అండ్ మిలిటరీ సైన్స్‌లో రెండు మాస్టర్ డిగ్రీలు పూర్తి చేశారు. 1984 డిసెంబర్ 19న జమ్మూ కశ్మీర్ రైఫిల్స్ విభాగంలో చేరారు. ఆర్మీలో 39 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అనేక హోదాల్లో పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్‌గా నియమితులయ్యారు.






