18-11-2025 01:03:24 AM
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం
బస్సును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్
45 మంది సజీవ దహనం
హైదరాబాద్ సిటీ బ్యూరో నవంబర్ 17 (విజయక్రాంతి): పవిత్ర ఉమ్రా యాత్రకు సౌదీ అరేబియాకు వెళ్లిన యాత్రికులు యాత్ర ముగించుకుని వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న బస్సు భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం కారణంగా బస్సులో ఒక్కసారిగా మంట లు వ్యాపించాయి. అగ్నికీలల్లో హైదరాబాద్‌కు చెందిన 45 మంది యాత్రికు లు సజీవ దహనమయ్యారు.
బస్సు కిటికీ బద్దలుకొట్టుకుని కింది కి దూకడంతో మహమ్మద్ అబ్దుల్ సోయబ్ అనే యువ యాత్రికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మత్యుంజ యుడిగా ప్రాణాలు దక్కిం చుకున్నాడు. యాత్రికులం తా విద్యానగర్, బహదూర్‌పుర, బజార్‌ఘాట్‌కు చెంది నవారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ప్రమా దం సంభవించింది. ఆ సమయంలో యాత్రికులు గాఢ నిద్రలో ఉన్నారు. మృతుల్లో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు.
ఘటనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ధ్రువీకరించారు. మృతిచెందిన వారిలో ఒకే కుటుం బానికి చెందిన 18 మంది ఉండటం పెద్ద విషాదం. వీరంతా నవంబర్ 9న నగరంలోని ‘అల్ మినా’, ‘అల్ మక్కా ట్రావెల్స్’ ద్వారా మక్కాకు వెళ్లి ఉమ్రాలో ప్రార్థనలు పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నారు. 23వ తేదీ వీరంతా తిరిగి స్వస్థలాలకు చేరుకోవాల్సి ఉండగా, ఇంతలోనే మృత్యువు వారిని కబళించింది.
ఒకే కుటుంబంలో 18 మంది మృతి
హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ సహా మూడు తరాలకు చెందిన 18 మంది కుటుంబ సభ్యులు ఈనెల 9న ఉమ్రా యాత్రకు వెళ్లారు. సౌదీ బస్సు ప్రమాదంలో 18 మందీ మృతిచెందారు. హైదరాబాద్‌లోని మృతుడి ఇంటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెళ్లి బంధువులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని భరో సా ఇచ్చారు. నసీరుద్దీన్ ఇంటికి వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ బంధువులతో మాట్లాడారు. రాష్ర్ట ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సౌదీకి రాష్ట్రప్రభుత్వ బృందం
రాష్ట్రప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఒక ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియాకు పంపించాలని నిశ్చయించింది. ఈ బృందానికి మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వం వహిస్తారని తెలిసింది. బృందంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగం అధికారులు సైతం ఉంటారు. మృతదేహాలకు సౌదీలోనే అంత్యక్రియలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో మృతుడి కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున సౌదీ వెళ్తారని తెలిసింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మేరకు మృతుల అంత్యక్రియలను సౌదీలోనే నిర్వహించనున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం చొరవ
ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం సహాయక చర్యల నిమిత్తం, బాధితుల సమాచారం కోసం 80024 40003 అనే నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.