calender_icon.png 28 September, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో మరణ శాసనం

28-09-2025 05:18:27 PM

కాంగ్రెస్ ది దద్దమ్మ ప్రభుత్వం 

ఆల్మట్టి కుట్రలను ఎండగడతాం 

ఇరిగేషన్ మంత్రికి సోయి లేదు 

కోమటిరెడ్డి డమ్మీ మంత్రి 

నల్లగొండ రైతులతో ఆల్మట్టిని ముట్టడిస్తాం 

మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి 

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో నల్గొండ రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు మరణ శాసన రాసినట్లు అవుతుందని మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంత కండ్ల జగదీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే కృష్ణ బేసిన్ లో ఆలస్యంగా నీళ్లు వస్తున్నాయని ఆల్మట్టి ఎత్తు పెంచితే ఇక్కడున్న భూములు పడావు పడతాయని పేర్కొన్నారు. ఇక్కడున్న అధికార కాంగ్రెస్ పార్టీకి సోయి లేదని ఇది దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  నల్గొండ రైతులతో కలిసి  చలో ఆల్మట్టి కార్యక్రమాన్ని చేపడతున్నామని తెలిపారు. ఆల్మట్టి వద్ద జరుగుతున్న కుట్రను బహిరంగంగా ఎండగడతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంతసేపు కమిషన్లు, పంపకాలు తప్పితే తెలంగాణ రైతాంగ సమస్యల గురించి అవగాహన లేదన్నారు. 

నల్గొండ జిల్లా నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నా ఆయనకు సోయి లేదని ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైతే నీళ్ల గురించి ఎలాంటి అవగాహన లేదని దుయ్య బట్టారు. అంగు ఆర్భాటాలు తప్పితే ప్రజల గురించి గానీ రైతులు గురించి గానీ ఆయనకి ఏ మాత్రం తెలియదని  ఆయన డమ్మీ ఓ మంత్రి అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో చలో ఆల్మట్టి కార్యక్రమం చేపట్టి ఆల్మట్టి వద్ద పెంపును అడ్డుకుంటామని ఈ రెండు మూడు రోజుల్లోనే ఒక కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. పైన ఉన్నది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వమే, కింద ఉన్నది రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు ప్రభుత్వమే, ఇక్కడున్న రేవంత్ రెడ్డి గురువుకు దక్షిణగా తెలంగాణ నీటి హక్కులను కట్టబెడుతుండని ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ఆయన వెంట నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్ తదితరులు ఉన్నారు.