calender_icon.png 11 November, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రకోట పేలుడు ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య

11-11-2025 11:47:36 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు(Delhi Red Fort blast) ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఈ పేలుడులో 17 మందికి గాయాలు కాగా, ఎల్ఎన్ జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ఎయిర్‌పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మూడు రోజుల పాటు ఎయిర్‌పోర్టుల్లో హై సెక్యూరిటీ ముమ్మరం చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎయిర్‌పోర్టు పార్కింగ్‌పైనా దృష్టిపెట్టాలని కేంద్రం ఆదేశించింది. ఢిల్లీ పేలుళ్ల ఘటనపై దర్యాప్తు సంస్థలను ముమ్మరం చేశారు. పేలుడుకు కారణమైన ఐ20 కారు పుల్వామాకు చెందిన తారిఖ్‌దిగా గుర్తించారు. ముగ్గురు చేతులు మారిన ఈ కారను చివరిసారిగా తారిఖ్ కొనుగోలు చేశాడు.

డాక్టర్‌ మహ్మద్‌ ఉమర్ పేలుడుకు కొన్ని క్షణాల ముందు కారు నడిపాడు. ఇందుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఈ ఘోరమైన పేలుడుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మంగళవారం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం,పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద గట్టి నిఘా ఉంచారు. ఈ ఘటనపై కేంద్రం అప్రమత్తమైంది. హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీ కూడా వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన పేలుడు నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది.