29 May, 2026 | 2:54 AM

తరుగు పేరుతో కోతలు

29-05-2026 12:00 AM
  1. ధాన్యం బస్తాకు 4 కిలోల తొలగింపు
  2. రైతులను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): తరుగు పేరుతో ధాన్యం బస్తాకు 4 కిలోల కోత విధిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. గురువారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. గత 25 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన చెప్పారు. ఐకేపీ కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీలు, టార్పాలిన్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు, నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనం అని మండిపడ్డారు.

తేమ, తరుగు పేరుతో ప్రతి బస్తాకు దాదాపు 4 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని, ఇది పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ధాన్యం, మక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు తడిసి, మొలకలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, రైతులను ఆదుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని వాపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంఎస్పీని పెంచు తూ రైతులను ప్రోత్సహిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల పంటను కొనుగోలు చేయడంలో చిత్తశుద్ధి చూపకుండా సాకులు వెతుకుతోందన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనాలని ఆయన డిమాండ్ చేశారు.