29 May, 2026 | 2:53 AM

చీరల పంపిణీకి టార్గెట్!

29-05-2026 12:00 AM

100 మంది మహిళలను తీసుకురాకపోతే చర్యలు అంటూ ఆర్పీలపై ఒత్తిడి!

వనపర్తి, మే 28 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న చీరల పంపిణీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలను తరలించాలని ఆర్పీలు, సమాఖ్య సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రతి సమాఖ్య నుంచి పక్కాగా 100 మంది మహిళలు హాజరు కావాలి అంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికార ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు హాజరవుతున్న కార్యక్రమం కావడంతో సభను జనాలతో నింపేందుకు అధికారులు దిగివచ్చినట్లు మహిళా సం ఘాల సభ్యులు చెబుతున్నారు. సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలతో పాటు, సభ్యు లు కాని వారినీ తీసుకురావాలని ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హాజరు తీసుకుంటాం... తక్కువైతే చర్యలు తీసుకుంటాం... అంటూ వచ్చిన హెచ్చరికలతో ఆర్పీలు, సమాఖ్య సభ్యులు భయాం దోళనకు గురవుతున్నారు. ఒక్కో సమాఖ్యకు 100 మంది టార్గెట్ పెట్టడం, ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలను తీసుకురావాలని ఆదేశించడం అధికారుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆయా వార్డులో మహిళలను ఇళ్లకు వెళ్లి బతిమిలాడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ సందేశాలు, మౌఖిక ఆదేశాలతో తప్పనిసరి హాజరు వాతావరణం సృష్టించారని మహిళా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.