08-11-2025 11:58:49 PM
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్...
ముషీరాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ కు బుద్ధి వచ్చేలా నవీన్ యాదవ్ ఓడించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పరిధిలో ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ జూబ్లీహిల్స్, రహమత్నగర్, బోరాబండ ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కల్యాణ లక్ష్మీ పథకం, హామీ ఇచ్చిన స్కూటర్లు, ఒక తులం బంగారం, రైతు బంధు, ఇందిర మ్మ ఇళ్లు, వృద్ధులకు రూ. 4,116 పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీల్లో ఒక్కటీ సక్రమంగా అమలు కాలేదని, అంతే కాకుండా వెనుక ద్వారం ద్వారా బస్సు ఛార్జీలను పెంచిందని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో కనీస పౌర సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ప్రస్తావిస్తూ, ప్రజలు పాలక పార్టీని జవాబుదారీగా నిలిపే సమయం వచ్చిందని ఆయన అన్నారు. ప్రజలు ఓటు ద్వారా కాంగ్రెస్కు పాఠం చెప్పాలి, అని పేర్కొంటూ, ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ అభ్యర్థని ఓడించాలని ప్రజలను పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీతో కుమ్మక్కై ద్వంద్వ పాత్ర పోషిస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు ఎండి. మాజీద్, రాములు గౌడ్, డాక్టర్ అంసారి జావిద్, లియాఖత్ ఖాన్, సనూజ్, రాకేష్ రెడ్డి, కొడంగల్ శ్రీనివాస్, ఎస్ ఎన్ రెడ్డి, నాగేంద్ర ప్రసాద్, రోహన్ తదితరులు పాల్గొన్నారు.