19-12-2025 01:32:22 AM
అన్ని పార్టీలు ఒక తాను ముక్కలే..
* భారత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణంగా మారాయి. ఒక పార్టీలో గెలిచి, మరొక పార్టీలోకి వెళ్లడాన్ని నిరోధించేందుకు చట్టంతెచ్చినా, పెద్దగా ప్రయోజనమైతే కనిపించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నేతల గోడదూకుళ్లకు అడ్డకట్ట పడాలంటే -ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని పటిష్టం చేయాలి. రాజకీయ నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీ గూటికి చేరడాన్ని సూచించే ఆయా రామ్- గయా రామ్ సంస్కృతి భారతదేశంలో కొత్తేమీ కాదు.
చాలా రాష్ట్రాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీలు మారిన ఉదంతాలు కోకొల్లలు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో పొందుపరచిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 1985లో తీసుకొచ్చారు. 1960ల్లో, 70ల్లో పార్లమెంటు, రాష్ర్ట అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఇష్టారీతిన పార్టీ ఫిరాయింపులకు పాల్పడేవారు.
దాన్ని నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే, చట్టం అమలులోకి వచ్చిన తరవాత కూడా దేశంలో పెద్దసంఖ్యలో ఫిరాయింపులు చోటుచేసుకున్నట్లు రాజ్యాంగం పనితీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ ఆక్షేపించింది. పదో షెడ్యూలు ఎందుకిలా అచేతనంగా మారిపోయిందనేది ప్రశ్నగానే మిగిలిపోయింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, మణిపూర్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. ఇలా అనేక రాష్ట్రాలలో ఫిరాయింపుల పేరిట ప్రజాప్రతినిధులు సులువుగా పార్టీలు మారుతున్నారు. మరి, ప్రజాతీర్పునకు, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని అనర్హులను చేయాలంటూ 38 ఏళ్ల కిందట తీసుకొచ్చిన ఫిరాయింపులు నిరోధక చట్టం ఏం చేస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయ క్రాంతి) : ఒక పార్టీలో గెలవడం, మరో పార్టీలో చేరడం. అక్కడ మంత్రి పదవి రాక పోతేనో, మరో కారణంతోనో మరో పార్టీ లోకి మారడం. పార్టీ అధికారం కోల్పో తుందంటే అధికారం చేపట్టే పార్టీలో చేర డం వంటివి ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాం.. చూస్తున్నాం. వాస్తవానికి ప్రజాస్వామ్యానికి ప్రధాన మూలస్థంభ మైన రాజకీయాలను నెరపే ప్రజా ప్రతిని ధులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి.
కానీ ప్రస్తుతం స్వార్థపూరిత రాజకీయాల చుట్టూనే ప్రజా ప్రతినిధులు తిరుగుతున్నారు. అటు రాజకీయ పార్టీల కు, ఇటు ప్రజా ప్రతినిధులకు నైతిక విలువ లే లేని పరిస్థితి దాపురించింది. పార్టీలు ఫిరాయించడమనేది సర్వసాధారణమై పోయింది. ఫిరాయింపులు పెచ్చరిల్లిపోవ డానికి అన్నీ పార్టీలూ కారణమే. దీనికి అన్నిపార్టీలు బాధ్యత వహించాల్సిన అవ సరముంది. రాజకీయ అవినీతికి, అనిశ్చితి కి, అస్థిరతకు కారణమవుతున్న పార్టీ ఫిరా యింపుల చట్టం గురించి తెలంగాణలో ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
ఆచరణలో నియంతృత్వం..
రాజ్యాంగం ప్రసాదించిన రాజకీయ స్వేచ్ఛతో తమ రాజకీయ పార్టీల సిద్ధాం తాల బలంతో ప్రజల సమస్యలను పరిష్క రిస్తూ వారి తలలో నాలుకగా మారి వారి అభిమానాన్ని చూ రగొనాల్సిన రాజకీయ విధానానికి కాలం చెల్లింది. ప్రస్తుతం కులాల కుంపట్లు రాజే స్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతూ, ఓటర్లను ప్రలోభపెడుతూ నోట్ల కట్టల ద్వారా ధనవంతులే చట్ట సభల్లోకి ప్రవేశించగలుగుతున్నారు.
పార్టీలు సైతం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఓ ప్రజాప్రతినిధిని గెలిపించుకోవడం కన్నా అందులోని సగం ఖర్చుతో ఫిరాయింపు ద్వారా తమ పార్టీలో కలుపుకోవడం సులభమనే కొత్త సిద్ధాంతం వెలుగు లోకి వచ్చింది. ఫిరాయింపులు జరిగినప్పుడు హార్స్ ట్రేడింగ్ ద్వారా ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లా కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం మా అభివృద్ధి కార్యక్రమాలతో ఆకర్షితులై మా ప్రభుత్వంలో చేరుతున్నారని బుకాయిస్తూ ఫిరా యింపులను ప్రోత్సహిస్తున్నాయి.
ఇటు గెలిచిన ఎమ్మెల్యేలు సైతం అధికారంలో వున్న వారికే అన్ని అభివృద్ధి పథకాలు, ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుందని.. రాజ్యాంగాన్ని విస్మరించి ఫిరాయింపుల ద్వారా అధికారానికి చేరువై స్వా మి కార్యంతో పాటు కోట్లకు పడగెత్తాలనే తమ స్వకార్యం కూడా నెరవేరుతోందని భా విస్తున్నారు. ఫలితంగా ప్రతిపక్షమే లేని ప్ర భుత్వాలు కొనసాగుతున్నాయి.
ఈ చర్యల ఫలితంగా చట్టసభల లోపలా, బయటా ప్రజల సమగ్ర అభివృద్ధికి అవసరమైన పాలనా విధానాల రూపకల్పనపై అధికార, విపక్షాల మధ్య అర్థవంతమైన చర్చ జరగాలనే ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడి ప్రజా స్వామ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫలితంగా ప్రజాస్వామ్యం ఆచరణలో ని యం తృత్వ పాలనా విధానంగా మారుతోంది. ఈ పరిణామం ప్రజలకూ, దేశానికి మంచిది కాదనే భావన సర్వత్రా వెల్లువెత్తుతోంది.
ఫిరాయింపు చట్టం ఉన్నా...
ఒక పార్టీ దేశాన్ని, లేదా రాష్ట్రాన్ని పాలించడానికి అవసరమైన మెజార్టీని కలిగివు న్నప్పుడు ఏ పార్టీ టికెట్‌తో నైనా చట్ట సభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ ప్రతిధులుగానే కొనసాగేవారు. కానీ కాల గమనంలో సంకీర్ణాల యుగం ప్రారంభమై జాతీయ పార్టీల ప్రాధాన్యత తగ్గి, ప్రాంతీయ పార్టీలు రాష్ర్టంలో అధికారాన్ని చేజిక్కించుకుని ఇతర జాతీయ పార్టీతో అలెయెన్స్ భాగస్వాములుగా మారి సదరు జాతీయ పార్టీకి కేంద్రంలో అధికారాన్ని అందించడానికి ఉపయోగపడడం ప్రారంభమైన తర్వాత పార్టీల ఫిరాయింపులు ఉధృతమైనవనే సత్యాన్ని జీర్ణించుకోక తప్పదు.
తమను ఎన్నికల్లో గెలిపించిన పార్టీల పట్ల, సిద్ధాంతాల పట్ల కృతజ్ఞత లేకుండా అధికారం కోసం కళ్ళు చెదిరే ప్యాకేజీల ఆకర్షణ వలలో పడి యధేచ్ఛగా పార్టీలు ఫిరాయిస్తూ తమని గెలిపించిన తల్లి లాంటి పార్టీని గేలిచేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వైనం అత్యంత దురదృష్టకరం. ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలనే కూల్చు తూ రాజకీయ అస్థిరతను సృష్టిస్తున్నారనే 1985లో యూపీఏ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని జారీ చేసింది.
మళ్లీ 2003లో దానిని సవరించినా చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని పార్టీమారిన ఉదంతాలను చూస్తున్నాం. ఇటీవలే ఎనిమిది రాష్ర్ట ప్రభుత్వాలను కూల్చివేసిన సంఘటనలతో రాజకీయ విలువలు అధఃపాతాళానికి చేరిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి లొసుగులను సరిచేయాలనే వాదన క్రమేణా బలపడుతోంది.
చట్టాల్లో లొసుగులు..
రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను నియంత్రించే లక్ష్యంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ను చేర్చి, దానిలో ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టా న్ని’ వివరించింది. దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించి, బలోపేతం చేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఆర్టికల్స్101, 102 190, 191ల్లో పార్టీ ఫిరాయిం పుల నిరోధక చట్టం గురించి పేర్కొన్నారు.
కానీ పదో షెడ్యూలు ముసాయిదాలోని లొసుగులే ఫిరాయింపులకు తావిస్తున్నాయి. ముఖ్యంగా మూకుమ్మడి ఫిరాయింపులకు అవి అవకాశమిస్తున్నాయి. ఎవరైనా చట్టసభ సభ్యులు తమ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నా, లేదా పార్లమెంటు లోగాని, రాష్ట్రాల అసెంబ్లీలోగాని సొంత పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు పదో షెడ్యూలు ప్రకారం అనర్హత వేటు పడుతుంది. స్వతంత్ర ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఎన్నికైన తరవాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అనర్హతకు గురవుతారు.
కానీ- స్పీకర్, చైర్‌పర్సన్ దగ్గర అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లు చాలాకాలం పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఫిరా యింపుల నిరోధక చట్టంలో రెండు మినహాయింపులున్నాయి. రాజకీయ పార్టీలో చీలిక లకు సంబంధించినది ఒకటైతే, రెండోది పార్టీల విలీనానికి చెందినది. పార్టీలు, చట్టసభ సభ్యుల మధ్య సైద్ధాంతిక విభేదాలు తలెత్తినప్పుడు ఫిరాయింపుల వంటి మినహాయింపులను ఉపయోగించుకోవచ్చని ఈ చట్టంపై జరిగిన పార్లమెంటరీ చర్చలు స్పష్టంచేస్తున్నాయి.
ఉద్దేశాలు మంచివే అయినా. ఇలాంటి మినహాయింపులను చా లామంది తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. అలా పదేపదే ఫిరాయింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగిస్తుండటంతో 2003లో చీలిక మినహాయిం పును తొలగించారు. విలీనానికి సంబంధించిన మినహాయింపు మాత్రం కొనసాగు తోంది. పదో షెడ్యూలు ప్రకారం... ఒకవేళ అభ్యర్థులు ఒకేసారి రెండు షరతులను నెరవేర్చగలిగితే అనర్హత వేటు నుంచి మినహా యింపు పొందవచ్చు.
ఒకటి, చట్ట సభ్యుడి సొంత రాజకీయ పక్షం మరొక పార్టీలో విలీనమైనప్పుడు కాగా, రెండోది, విలీనానికి అంగీకరించిన లెజిస్లేచర్ పార్టీలోని మూ డింట రెండొంతుల మంది సమూహంలో సభ్యుడైనప్పుడు మినహాయింపు లభిస్తుంది. ఉదాహరణకు 2019లో గోవా శాసనసభలో ఉన్న మొత్తం 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో పదిమంది భాజపాలో చేరారు. అది భాజపా, కాంగ్రెస్ శాసనసభా పక్షాల మధ్య చెల్లుబాటైన విలీనంగా నిలిచింది.
ఆ పదిమంది కాంగ్రెస్ సభ్యులనూ గోవా అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు నుంచి మినహాయించారు. ఆ నిర్ణయాన్ని గోవాలోని బాంబే హైకోరు ధర్మాసనం సైతం సమర్ధించింది. రెండు శాసనసభా పక్షాల మధ్య విలీనాలను మాత్రమే నిరూపించాల్సిన అవసరం ఉండటంతో మూకుమ్మడి ఫిరాయింపుల ప్రక్రియ మరింత సులభతరంగా మారింది. ఫిరాయింపులకు పాల్పడే చట్టసభ సభ్యులపై అనర్హత వేటు పడకుండా అడ్డుకోవడంలో విలీనాలు, చీలికలే కీలకంగా మారుతున్నాయి.
సమగ్రంగా సమీక్షించాలి..
ఫిరాయింపుల నిరోధక చట్టం- స్వతంత్ర ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలో మాత్రం కొంతమేర విజయం సాధించిందని చెప్పవచ్చు. 1989- 2011 మధ్య హరియాణా అసెంబ్లీలో దాఖలైన 39 పిటిషన్లలో స్పీకర్ 12 సందర్భాల్లో అనరత వేటు వేశారు. తొమ్మిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు అనరతకు గురయ్యారు. ఇందులో 2004లో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలపై వేటు పడిన సందర్భమూ ఉంది. ఆ ఎమ్మెల్యేలంతా రాజ్యసభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో చేరినవారే.
1988- మధ్య మేఘాలయ అసెంబ్లీలో 18 అనరత పిటిషన్లు దాఖలయ్యాయి. ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలో చేరినందుకు స్పీకర్ వారిపై వేటు వేశారు. ఎన్నికలు ముగియగానే రాజకీయ పక్షాల్లో చేరిపోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేశారని పేర్కొన్నారు. ఒక అధ్యయనం ప్రకారం, 1986 మధ్య లోక్‌సభ స్పీకర్ల ముందు దాఖలైన 55 అనర్హత పిటిషన్లలో నలభై తొమ్మిదింటిలో ఏ ఒక్క సభ్యుడిపైనా అనర్హత వేటు పడలేదు.
వారంతా పార్టీలు మారినవారే. ఇందులో 77 శాతం తమ ఫిరాయింపును చెల్లుబాటయ్యేదిగా రుజువు చేసుకోవడం గమనార్హం. ఉత్తర్ ప్రదేశకు సంబంధించి 1990 మధ్య 69 పిటిషన్లు దాఖలు కాగా, కేవలం రెండు పిటిషన్లలోనే అనర్హత వేటు పడింది. 67 కేసుల్లో చర్యలేమీ లేవు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న దుస్ధితి ఇదీ.
పలు రాష్ట్రాల స్పీకర్ల నిర్ణయాలకు సంబంధించిన గణాంక సమాచారం సంబంధిత వెబ్‌సైట్లలో చేర్చనేలేదు. దీన్ని పదో షెడ్యూలు సమగ్ర మూల్యాంకనానికి అడ్డంకిగా భావించవచ్చు. ఇప్పటికైనా పదో షెడ్యూలు పనితీరును సమగ్రంగా పరిశీలించి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి.
నాటి నుంచే..
ఒకప్పుడు పార్టీ ఫిరాయించడమంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలో, ఎంపీలో వేరే పార్టీలోకి మారిపోవడం లేదంటే, మద్దతు పలకడం ఉండేది. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చే వరకు అలాంటి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండేది కాదు. 1960ల నాటికి ఈ ధోరణి బాగా పెరిగిపోయి వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల అస్థిరత అనే సమస్య తీవ్రమైంది. 1969 నాటి చవాన్ కమిటీ నివేదిక, నాలుగో సార్వత్రిక ఎన్నికల తరువాత, మార్చి 1967, ఫిబ్రవరి 1968 మధ్య ఉన్న ఏడాదిలోపు కాలంలో అనేక రాష్ట్రాలలో శాసనసభ్యులు పెద్ద సంఖ్య లో పార్టీని ధిక్కరించినట్లు పేర్కొంది.
మొదటి సార్వత్రిక ఎన్నిల నాటి నుంచి నాలుగో సార్వత్రిక ఎన్నికల నాటికి సుమారు రెండు దశాబ్దాల కాలంలో 542 ఫిరాయింపు సంఘటనలు జరిగితే, కేవలం 1967 మధ్య కాలంలోనే కనీసం 438 ఫిరాయింపులు జరిగినట్లు చ వాన్ కమిటీ గుర్తించింది. ఈ రెండు దశాబ్దాలలో 376 మంది ఇండిపెండెంట్ సభ్యుల్లో 157 మంది వేరే పార్టీలకు మారారు. పదవులను ఆశించి ఎక్కువమంది ఫిరాయింపులకు పాల్పడ్డారని కూడా ఈ కమిటీ పేర్కొంది.
ఈ కాలంలో వివిధ రాష్ట్రాలలో ఫిరాయించిన 210 మంది శాసనసభ్యులలో 116 మందికి మంత్రి పదవులు దక్కాయి. 1967 నుంచి 1971 మధ్య 142 మంది ఎంపీలు, 1900 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారని పలు కథనాల ఆధారంగా స్పష్టమైంది. హరియాణా రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గయాలాల్ అనే ఎమ్మెల్యే వారం రోజుల వ్యవధిలో నాలుగు పార్టీలు మారడం, అందులో ఓకే రోజు మూ డు పార్టీలు మారినట్లు తేలడం పార్టీ ఫిరాయింపుల తీవ్రతకు అద్ధం పట్టింది. అప్పటి నుంచే ‘ఆయా రామ్, గయా రామ్’ అనే నానుడి దేశ రాజకీయాల్లో బాగా ప్రసిద్ధి పొందింది.
ఫిరాయింపులు అరికట్టడమెలా..?
రాష్ర్టంలో, దేశంలో ఎన్నికలు జరగే సందర్భాల్లో కోట్లాది రూపాయలను వెచ్చించి ఓటర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అధికార, విపక్షాలకు చెందిన రాజకీయ పార్టీల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటాయి. పైగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు మేమే డబ్బు సంచులను పంపుతున్నామని గెలిచాక వారు మా పార్టీలోకి వస్తారని క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రులు చేస్తున్న బహిరంగ ప్రకటనలు రాజకీయాల్లో దిగజారుతున్న నైతిక విలువలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎన్నికలను జరిపాల్సిన ఎన్నికల యంత్రాంగం అస్థిత్వానికీ, నిబద్ధతకు సవాల్ విసురుతున్నాయి. ఈ పరస్పర ఆరోపణలు ప్రపంచ రాజకీయ యవనికపై మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించేవే. ఈ నేపథ్యంలో పార్టీల ఫిరాయింపు రాజకీయ రంగంలో ఓ అనైతిక చర్యగా సమాజం గుర్తించాలి. ఓ పార్టీ జెండాపై గెలిచి మరో పార్టీ జెండా మోయడం ఆత్మహత్యా సదృశ్యంగా రాజకీయ పార్టీలు భావించాలి.
ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతు న్నపుడు వారి గెలుపుకు కారకులైన ప్రజలు తమ తీర్పుని ధిక్కరిస్తూ ఇతర పార్టీలలోకి ఫిరాయిస్తున్న వారిని చిత్తు చిత్తుగా ఓడించాలి. అలాగే ఎన్నికల చట్ట సవరణ ద్వారా ప్రజాప్రతినిధి ఎన్నికలలో గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయింపుకు పాల్పడినా వారి శాసన సభ్యత్వాన్ని రద్దుచేయడంతో పాటు మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి.
ఫిరాయింపులను అరికట్టినప్పుడే రాష్ర్టంలో, దేశంలో సుస్థిరతతో కూడిన పాలన కొనసాగి రాష్ర్టం, దేశం ప్రగతి పధం వైపు పయనిస్తాయి. రాబో యే ఎన్నికలలో మన రాష్ర్టంలో, దేశంలో ఫిరాయింపులకు ఆస్కారం లేని రాజకీయా లు కొనసాగి మన ప్రజాస్వామ్య వ్యవస్థ తిరుగులేని పాలనా విధానంగా వెలుగొందుతుంది.
వివాదాస్పదంగా స్పీకర్ల తీరు..
కొంతకాలంగా శాసనసభ స్పీకర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన శాసన సభ్యులపై ఫిరాయింపు నిరోధక చట్ట నిబంధనల మేరకు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు రావటంతో స్పీకర్లు రాజ్యాంగబద్దంగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్పీకర్ చట్టసభల గౌరవాన్ని కాపాడాలి. పార్టీ ప్రతినిధిగా కాకుండా రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించాలి.
పార్లమెంటరీ సంప్రదాయాలను తూ.చ. తప్పకుండా పాటించాలి. కానీ చాలా రాష్ట్రాలలో స్పీకర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇందు కు తాజా ఉదాహరణగా తెలంగాణలో చోటు చేసుకున్న పరిస్థితిని పేర్కొన వచ్చు. 2014లో రాష్ర్ట ఏర్పాటు నుండి ఇప్పటివరకు దరిదాపు 53 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. కానీ ఏ ఒక్క శాసనసభ్యుడి పైనా స్పీకర్లు ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు చేపట్టలేదు.
తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పార్టీ ఫిరాయించిన పదిమంది శాసనసభ్యులపై చర్యలు చేపట్టడంలో జాప్యం చేస్తున్న తీరుపై బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా స్పీకర్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఘాటుగా హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర కృష్ణానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున గెలిచిన ముకుల్ రాయ్ టీఎంసీలోకి ఫిరాయించటంతో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు సువేందు అధికారి అతడిని అనరునిగా ప్రకటించాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆ సభ్యుడిపై అనర్హత వేటువేయకుండా స్పీకర్ జాష్యం చేస్తుండటంతో కలకత్తా హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో కోర్టు... పార్టీ ఫిరా యించిన శాసనసభ్యుడిని ఇటీవలే అనర్హునిగా ప్రకటించింది. 2023లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఆరు గురు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేసి సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమైనారు. ఆ ఆరుగురు శాసన సభ్యులను స్పీకరు తక్షణమే అనర్హులుగా ప్రకటించారు.
కానీ తెలంగాణ రాష్ర్టంలో బీఆర్‌ఎస్ నుండి గెలిచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన పదిమంది శాసనసభ్యులపై చర్య తీసుకోవడానికి స్పీకరుకు మరికొంత వ్యవధిని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పటికైనా స్పీకరు చర్యలు తీసుకుంటారా? పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అమలు చేయకుండా ఒక్కొక్క రాష్ర్టంలో స్పీకర్లు ఒక్కొక్క తరహా నిర్ణయం తీసుకోవడంతో చట్టం అపహాస్యం పాలవుతోంది.
ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్న ‘ఒక పార్టీ ప్రజాప్రతినిధుల్లో 2/3 వంతు మంది పార్టీ మారితే అది ఫిరాయింపు చట్టం పరిధిలోకి రాదు అనే నిబంధనను అడ్డు పెట్టుకొని 2014లోనూ, 2018లోనూ తెలంగాణ రాష్ర్టంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుండి తప్పించుకున్నారు. చట్టంలోని ఇటువంటి మినహాయింపులను సాకుగా చూపి ఫిరాయింపుదారులూ, స్పీకర్లూ చాలా సార్లు రాజ్యాంగ విలువలకే తూట్లు పొడవడం శోచనీయం. ఈ చట్టాన్ని మరింత పదునైనదిగా మార్చినప్పుడే కొంతమేరకైనా పార్టీ ఫిరాయింపులను నిరోధించడం సాధ్యమవుతుంది.
ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ప్రధాన నిబంధనలు..
అనర్హత ఎప్పుడు పడుతుందంటే...
* ఒక పార్టీకి చెందిన సభ్యుడు తనంతట తానుగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు
* పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా సభలో జరిగిన ఓటింగ్‌లో ఓటు వేసినప్పుడు
* ఎన్నికల తర్వాత ఒక ఇండిపెండెండ్ సభ్యుడు వేరే పార్టీలో చేరినప్పుడు
* ఒక నామినేటెడ్ సభ్యుడు, తాను నామినేట్ అయిన ఆరు నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినప్పుడు
అనర్హత వేటు ఎప్పుడు ఉండదంటే...
* ఒక పార్టీ నుంచి మూడింట ఒకవంతు వర్గం విడిపోయి వేరే వర్గంగా మారితే
* ఒక పార్టీ మొత్తం మరొక పార్టీలో విలీనమైతే, లేదంటే కొత్త పార్టీగా ఆవిర్భవించి నప్పుడు అందులో సభ్యులపై
* ఒకపార్టీ విడిపోయి ఒక వర్గం వేరొక పార్టీలో చేరుతున్నప్పుడు, అందులో చేరడానికి ఇష్టపడక, ప్రత్యేక వర్గంగా కొనసాగదలుచుకున్న సభ్యులపై
* ఓటింగ్‌లో పాల్గొనడానికి 15 రోజుల ముందు పార్టీ అనుమతి తీసుకుని, ఆ ఓటింగ్‌కు దూరంగా ఉన్న సభ్యులపై అనర్హత ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు స్పీకర్, చైర్మన్లకు ఈ చట్టం కట్టబెట్టింది.
తెలుగు రాష్ట్రాలలోనూ అదే తీరు..
తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులు కొత్త విషయమేమీ కాదు. 2014లో రెండు రాష్ట్రాలు విడిపోయి, సరిపడా ఎమ్మెల్యేలతో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడినా, అధికార పార్టీలు ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాయి. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 66 మంది ఎమ్మెల్యేలలో 23 మందిని తమవైపు తిప్పుకున్నది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అయితే, టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వైసీపీ పార్టీలో చేరకపోయినా, వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇటు తెలంగాణలో 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభా పక్షం మొత్తాన్ని విలీనం చేసుకుంది. మొదట ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ వైపు వెళ్లగా, ఆ తర్వాత 10మంది ఎమ్మెల్యేలు టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా స్పీకర్‌ను కోరడంతో ఆయన దాన్ని ఆమోదించారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ నుంచి చివరకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్య మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలుగా మిగిలారు. తెలంగాణలో 2018 ఎన్నికల తర్వాత ఎన్నికైన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు(సండ్ర వెంకట వీరయ్య, మచ్చా నాగేశ్వరరావు) కూడా తమను పార్టీలో విలీనం చేసుకోవాల్సిందిగా టీఆర్‌ఎస్‌ను కోరగా ఆ విలీనం కూడా జరిగిపోయింది.
అదే సమయంలో కాంగ్రెస్ పక్షం నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018 ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, వారిలో చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీని చీల్చి బీజేపీలో విలీనం కావడం కూడా కీలక పరిణామమే.
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు వై.ఎస్.చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆరుగురు సభ్యులున్న రాజ్యసభలో నలుగురు మెజారిటీ కాబట్టి తమని ప్రత్యేక వర్గంగా గుర్తించి భారతీయ జనతాపార్టీలో విలీనమయ్యేందుకు అంగీకరించాలని వారు రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు. తర్వాత వారు బీజేపీలో చేరారు.