calender_icon.png 19 December, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా డీలిమిటేషన్

19-12-2025 01:33:28 AM

బీజేపీ నియోజకవర్గ  ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి 

మేడ్చల్, డిసెంబర్ 18(విజయ క్రాంతి): మేడ్చల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జిహెచ్‌ఎంసిలో విలీనం చేసి కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా డివిజన్ల డిలిమిటేషన్ చేశారని బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చేలా, పోటీ చేయడానికి సులభంగా ఉండేలా ఒక డివిజన్ లో ఎక్కువ, ఒక డివిజన్లో తక్కువ జనాభాతో విభజించారన్నారు.

డివిజన్ ల డీలిమిటేషన్ కు ఏ అంశం ప్రామాణికంగా తీసుకున్నారో అధికారులు చెప్పడం లేదన్నారు. ఒక విధానం అంటూ లేకుండా రాత్రికి రాత్రి డివిజన్ల విభజన చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబీకులకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చేలా ఏదులాబాద్ డివిజన్ డీ లిమిటేషన్ చేశారని, ఒక బూత్ లో 200 మంది మహిళలను చేర్చారని ఆరోపించారు.

అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్ కుమారుడు అజయ్ యాదవ్ కు అనుకూలంగా బోడుప్పల్ డివిజన్ డీలిమిటేషన్ చేశారన్నారు. పాతబస్తీలో పదివేల జనాభాకు ఒక డివిజన్ ఏర్పాటు చేసి శివారు ప్రాంతాలలో 70 నుంచి 80 వేల జనాభాకు ఒక డివిజన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా అస్తవ్యస్తం కావడానికి కాంగ్రెస్ నాయకులే కారణమని, వీరికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 

మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గానికి పెద్ద శని

ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గానికి పట్టిన పెద్ద శని అని, ఆయన అసమర్ధత వల్లే జిల్లాకు ఈరోజు ఈ పరిస్థితి పట్టిందని సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్న ఏనాడు అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపారం అభివృద్ధి చేసుకున్నారని దుయ్యబట్టారు. డీలిమిటేషన్ పై దొంగ ఏడుపులు తప్ప చిత్తశుద్ధి లేదని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో హైప్ కోసమే మాట్లాడతారని అన్నారు. మల్లారెడ్డిని వచ్చే ఎన్నికల్లో జిల్లా నుంచి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డివిజన్ ల డీలిమిటేషన్ పై బిజెపి ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సముద్రాల హంస కృష్ణ గౌడ్, బాలేష్, షామీర్పేట్ మండల బిజెపి అధ్యక్షుడు కృష్ణ, నాయకులు చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి, బొజ్జ వంశీధర్ రెడ్డి, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.